ఆదివారం, జనవరి 15, 2012

గణనాథా సేవించెదమయ్యరో (హరికథ)

దేవస్థానం సినిమాలోని మరో హరికథ ఇది. కథ లోనే చెప్పినట్లు ఇది హరికథ, అంటే కేవలం శ్రీహరిని స్తుతించేది మాత్రమే కాదు మన కష్టాలనూ బాధలనూ హరించే తరుణోపాయం చెప్పే కథా అని మనం అర్ధం చేసుకోవాలి. ప్రస్తుత జనరేషన్ కి చాలా ఆవశ్యకమైన సలహాలను ఇస్తూ మాదకద్రవ్యాలకు అలవాటుకాకుండా ఎలా నిగ్రహించుకోవాలీ పెరుగుతున్న టెక్నాలజీ వెసులుబాట్లను ఎలా సమర్ధవంతంగా ఉపయోగించాలో తెలియజేస్తూ సాగే ఈ కథను స్వరవీణాపాణి రచించి స్వరపరిస్తే బాలుగారు ఆలపించారు. మీరూ ఇక్కడ విని ఆనందించండి.
మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 
 

చిత్రం : దేవస్థానం
సాహిత్యం : స్వరవీణాపాణి
సంగీతం : స్వరవీణాపాణి
గానం : SP బాలు

గణనాథా సేవించెదమయ్యరో.. విఘ్నాలను మాపే మా అయ్యరో..
ఓరయ్య గణపయ్యా.. మముగావగ రావయ్యా..
నిను నమ్మిన బంటులమయ్యా మాతో ఉండయ్యా..
మాతో ఉండయ్యా.. మాతో ఉండయ్యా...

భక్తమహాశయులారా ఇది హరికథ, అంటే కేవలం శ్రీహరిని స్తుతించేది మాత్రమే కాదు మన కష్టాలనూ బాధలనూ హరించే తరుణోపాయం చెప్పే కథా అని మనం అర్ధంచేసుకోవాలి. ప్రపంచంలో సుమారు ముప్పై కోట్లమంది మనదేశంలో సుమారు ఏడున్నరకోట్లమంది మాదక ద్రవ్యాల మహమ్మారి  విషకోరలలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారూ.. దీనికి కారణం మనో నిగ్రహం కోల్పోవడమే.. చలించని మనోనిగ్రహం మనిషికి ఎంత అవసరమో మన పురాణాల్లో ఎంతో స్పష్టంగా చెప్పబడింది. 
ఇహ కథ మొదలుపెడదాం..
ఒక్కసారిగా అందరూ జై రమా రమణ గోవిందో హారి..
శ్రీరాముడు దండకారణ్యంలో సీతా లక్ష్మణులతో వనవాసం చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్న రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ...

సుందరాంగుడగు రాముని జూడగ మనోనిగ్రహము వీడే..
సొగసులొలికించి హొయలు కురిపించి ఆతని పొందును కోరే...
అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే..
నీలమేఘ శ్యాముడూ మనోనిగ్రహ ధీరుడూ..
సకల గుణాభిరాముడూ.. ఏకపత్నీ సచ్ఛీలుడూ..
వలదు వలదంచు నీతి వాక్యముల శూర్పణఖను వారించే..
ముందు జరుగబోవు దుష్కర్మల తెలిసి నిగ్రహము వహియించే..

భక్తులారా ఈ విషయాన్ని మనం శ్రద్దగా గమనిస్తే.. మనో నిగ్రహం వీడి శూర్పణఖ లంకావినాశనానికి కారణమైతే శ్రీరాముడు మనోనిగ్రహంతో ఎన్నో కష్ట నష్టాలను తన ధర్మాయుధంతో జయించి మనందరికీ దేవుడైనాడు. అయ్యా విశ్వవిజేత నేటిమానవుడు ప్రస్తుతం ఎలా ఉన్నాడయ్యా అంటే.. 
ఎదిగినకొద్దీ ఒదిగుండాలనే..
ఎదిగినకొద్దీ ఒదిగుండాలనే మాటను అటకెక్కించాడూ..
తనకు తానుగా విర్రవీగి తన పతనాన్ని స్వాగతించాడూ..
కొకైన్ హెరాయిన్ గుట్కా జర్దా కనుగొని సుఖమని మురిసాడూ..
ఊపిరితిత్తుల మూత్రపిండముల గుండెజబ్బులను పెంచాడూ..
మృత్యువుతో ఆటాడీ ఓడీ త్వరగా కాటికి నడిచాడూ..

మత్తులో ఊగుతూ తూగుతూ సర్వం కోల్పోతూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని మనం ఎలా కాపాడుకుందామయ్యా అంటే..
మత్తుకు బానిస కావద్దు.. గమ్మత్తుగ ఉందని మురియొద్దు..
మనోనిగ్రహం వీడొద్దూ.. అకాల మృత్యువును కోరద్దూ..
నీ కుటుంబ బాధ్యత మరవొద్దు.. నీ బ్రతుకునూ బుగ్గిగా మార్చొద్దూ..
సహృదయలందరూ గాట్టిగా ఓకసారి జై రమా రమణ గోవిందో హారి..
 
మరో కోణంలో మానవునిలోని విఙ్ఞానమనే వెర్రితలలు అఙ్ఞానాన్ని ఎలా పెంచుతున్నాయయ్యా అంటే..
కంప్యూటర్ తోనే కాపురమే చేస్తూ ఇంటర్నెట్ అంటూ ఇంటిని వదిలేస్తూ..
సెల్ ఫోన్ మీటింగులతో.. యువత నాశనమైపోతుంటే..
మనసు మమత మమకారం మరచిపోతుంటే..
తనకు తానే శత్రువై ప్రశాంతి లేక విలపిస్తుంటే..

మరి అలాంటి వాళ్ళు ఎలా బాగుపడాలయ్యా అంటే..
అవసరానికే సెల్ ఫోన్ అత్యవసరానికే లాప్ టాప్
విఙ్ఞాన గని లాగ ఇంటర్నెట్ ను వాడాలీ...
యోగా ధ్యానం దైవ చింతనం చేయాలీ..
అన్యోన్య ప్రేమానురాగ జీవితం గడపాలీ..
మనిషిగ బ్రతకాలీ.. ముందుకు సాగాలీ..

భక్తులారా ఇప్పటిదాకా మీరు ఎంతో శ్రద్దగా విన్న విషయాల్ని చిత్తశుద్దితో ప్రపంచం ఆచరిస్తే
ఆనందమే మహానందమే ఈ ప్రపంచానికీ మానవజాతికి ఆనందమే మహానందమే

జై ఆరోగ్యప్రదమైన ప్రపంచానికీ జై..
జై శాంతిసామరస్య ప్రదమైన ప్రపంచానికీ జై..
శుభం శుభం స్వస్తి.  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.