ఆదివారం, మే 20, 2012

కుర్రాడనుకుని కునుకులు తీసే..

తను నవ్వుతో చంపేస్తుంది/చంపేస్తాడు అని మీరు చాలా సార్లు వినే ఉంటారు కదా, ఎక్కడో తారసపడిన నవ్వును చూసి కూడా అనుకుని ఉండచ్చు "హబ్బా కిల్లింగ్ స్మైల్ రా బాబు" అని. అలాంటి నవ్వు వినాలనుకుంటున్నారా ఐతే బాలు తన కెరీర్ కొత్తలో (1977) పాడిన ఈ పాట వినండి. తన స్వరం ఎంత లేతగా స్వచ్చంగా హాయిగా ఉంటుందో పాటలో అక్కడక్కడ వచ్చే నవ్వు అంతే బాగుంటుంది. "చిలకమ్మ చెప్పింది" సినిమాలోని ఈ పాటలో అంత చక్కని బాలు స్వరానికి తగినట్లుగా నటించినది రజనీకాంత్, ఇక పాట చూసిన అమ్మాయిలు ప్రేమలో పడకుండా ఉండగలిగి ఉండే వారంటారా అప్పట్లో. వీడియో చూసి మీరే చెప్పండి. 

పట్నంనుండి డ్యూటీ నిమిత్తం తన ఊరొచ్చి నివాసం ఉంటున్న హీరో రజనీవి అన్నీ కుర్రచేష్టలని తనో మెచ్యూరిటీ లేని కుర్రాడని సులువుగా కొట్టిపారేసి మనసులో ప్రేమ ఉన్నా బయటపడనివ్వకుండా బెట్టుచేసే హీరోయిన్ సంగీతని చూసి రజనీ పాడేపాట ఇది. ఈ సినిమా అక్కడక్కడా కాస్త బోరుకొట్టినా మొత్తంగా బాగానే ఉంటుంది చివర్లో మరో కథానాయిక శ్రీప్రియ నిర్ణయం ఆరోజుల్లో చాలా ధైర్యంగా తీసుకున్న నిర్ణయమనే చెప్పాలి. చక్కని తెలుగులొ ఆత్రేయగారు అందించిన సాహిత్యానికి ఎమ్మెస్ విశ్వనాథన్ గారు సంగీతమందించారు. ఈ పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలనుకున్న వారు ఇక్కడ వినవచ్చు.

 
చిత్రం : చిలకమ్మ చెప్పింది..(1977)
సంగీతం :  M.S.విశ్వనాథన్
రచన : ఆత్రేయ
గానం : బాలు

కుర్రాడనుకుని కునుకులు తీసే..
హహ వెర్రిదానికీ.. పిలుపూ..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపు ఇదే నా మేలుకొలుపూ..ఊ..!!

మల్లెలు విరిసే మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
మల్లెలు విరిసే మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
దీపమంటీ రూపముంది..
దీపమంటీ రూపముంది..
కన్నె మనసే చీకటి చేయకు..
కన్నె మనసే చీకటి చేయకు..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపు ఇదే నా మేలుకొలుపూ..ఊ..!!

మత్తును విడిచీ.. మంచిని వలచీ..
తీపికానుక రేపును తలచీ..
కళ్ళు తెరిచి.. ఒళ్ళు తెలిసీ..
మేలుకుంటే మేలిక మనకూ..
మేలుకుంటే మేలిక మనకూ..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపూ.. ఇదే నా మేలుకొలుపూ..ఊ..

వెన్నెల చిలికే వేణువు పలికే
వేళ.. నీ కిది నా తొలిపలుకు
వెన్నెల చిలికే వేణువు పలికే
వేళ.. నీ కిది నా తొలిపలుకు
మూగదైనా రాగవీణ..
మూగదైనా రాగవీణ..
పల్లవొకటే పాడును చివరకు..
పల్లవొకటే పాడును చివరకు.

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలుకొలుపు

4 comments:

ఐతే బాలు తన కెరీర్ కొత్తలో (1977) పాడిన ఈ పాట వినండి.----అప్పటికి పదకొండేళ్ళ నుంచి ఘంటాపధంగా పాడుతున్నాడు కదండీ ఆయన,ఇంకా తన కెరీర్ కొత్త అంటారేంటి మీరు?ఆక సెరియం ఆక సెరియం

Balasubrahmanyam made his debut as a playback singer on 15 December 1966 with Sri Sri Sri Maryada Ramanna,[12] a Telugu film scored by his mentor, S. P. Kodandapani.--- http://en.wikipedia.org/wiki/S._P._Balasubrahmanyam

హ్మ్ థ్యాంక్స్ రాజేంద్ర గారు. అంతకు పదకొండేళ్ళముందునుండీ పాడుతున్నారా.. నాకెందుకో తను డెబ్బైలలో మాత్రమే మొదలెట్టినట్టు గుర్తుందండీ. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. తనగొంతులోని ఆ లేతదనం మాత్రం ఎనభైలమొదట్లో వచ్చిన పాటల వరకూ ఉన్నట్లుంది. మొత్తమ్ కెరీర్ ని నాలుగు భాగాలగా చేసుకుంటే మొదటి భాగం అనుకోవచ్చేమో. బాగా కవర్ చేసుకున్నానా :D

ఈ పాట కోసమే ఈ మధ్యనే చూసాను ఈ సినిమా. భలే ఉంటుంది ఈ పాట :)
రజనీకాంత్ గారి గురించి ఇక చెప్పేదేముంది ...

Mahek గారు ధన్యవాదాలు. అవునండీ రజనీ గురించి చెప్పేదేముంది :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.