బుధవారం, మే 02, 2012

చెలిమిలో వలపు రాగం

రకరకాల పద్దతులలో తీసుకునే మాదకద్రవ్యాల(డ్రగ్స్) గురించి వినేఉంటారు కానీ చెవుల ద్వారా సూటిగా మన మెదడుకు చేరుకుని ఆపై మత్తును తనువంతా ప్రవహింప చేసి మనిషిని తన స్వాధీనంలోకి తెచ్చుకునే ఒక డ్రగ్ గురించి మీకు తెలుసా ?? ఆ! తెలిసే ఉంటుంది లెండి తెలుగువారై అదీ నాపాటల బ్లాగ్ చదువుతూ ఇళయరాజా పాటలు వినలేదంటే నేను నమ్ముతానా.. ఆయన కొన్ని పాటలలో ఇలాంటి ఏదో తెలియని మత్తుమందును కలిపి కంపోజ్ చేస్తారు. ఆపాటలు ఎన్ని వేల సార్లు విన్నా అలా తన్మయంగా వింటూ ఉండిపోగలమే కానీ మరో ఆలోచన చేయలేం.

మౌనగీతం సినిమాలోని “చెలిమిలో వలపు రాగం” అన్న ఈ పాట అలాంటి మత్తుమందుని నింపిన పాటే... పాటకి ముందు నిముషం పాటు వచ్చే మ్యూజిక్ బిట్ కానీ పపపపా అంటూ తీసే ఆలాపన కానీ పాట మూడ్ లోకి అలా తీస్కెళిపోతే పాట ముగిసేంతవరకూ ఆత్రేయ గారి సాహిత్యం, బాలు జానకిల గాత్రం ఇళయరాజా స్వరాలతో కలిసి మిమ్మల్ని మరోలోకంలో విహరింప చేస్తుంది. ఒక్కసారి కళ్ళుమూసుకుని ఈ పాట విని చూడండి నిజం అనిపించకపోతే నన్ను అడగండి. ఇదే సినిమాలోని “పరువమా చిలిపి పరుగు తీయకు” కూడా నాకు చాలా ఇష్టం. ఆ పాట గురించి ఇది వరలో నేను రాసుకున్న టపా ఇక్కడ చూడండి.

ఈ పాట వీడియో ఎంబెడ్ పనిచేయనందున యూట్యూబ్ లో ఇక్కడ చూడగలరు. ఆడియో మాత్రమే కావాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రయత్నించండి. వీడియో పై ఆసక్తి లేనివారు ఇక్కడ వీడియోలో బొమ్మల ప్రజంటేషన్ చూస్తూ పాట వినవచ్చు.


చిత్రం : మౌనగీతం (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి

పపపపా.. పపపపాపా..
పపపపా.. పపపపాపా..

చెలిమిలో.. వలపు రాగం..
వలపులో.. మధుర భావం..
రాగం భావం కలిసే ప్రణయగీతం
పాడుకో.. పాప పపా
పాడుతూ.. పాప పపా
ఆడుకో.. పాప పపా

చెలిమిలో.. వలపు రాగం..
వలపులో.. మధుర భావం..

ఉయ్యాలలూగినానూ... నీ ఊహలో 
నెయ్యాలు నేర్చినానూ.. నీ చూపులో
ఆరాధనై గుండెలో..
ఆలాపనై గొంతులో.. 
అలల లాగా కలల లాగా..
అలల లాగా కలల లాగా.. కదలి రాగా...

చెలిమిలో.. వలపు రాగం..
వలపులో.. మధుర భావం..

నులివెచ్చనైన తాపం... నీ స్నేహము
ఎదగుచ్చుకున్న భావం.. నీ రూపము
తుదిలేని ఆనందమూ..
తొణుకాడు సౌందర్యమూ..
శ్రుతిని చేర్చీ.. స్వరము కూర్చీ..
శ్రుతిని చేర్చీ.. స్వరము కూర్చీ.. పదము కాగా

చెలిమిలో.. వలపు రాగం..
వలపులో.. మధుర భావం..
రాగం భావం కలిసే ప్రణయ గీతం
పాడుకో.. పాప పపా
పాడుతూ.. పాప పపా
ఆడుకో.. పాప పపా
పపపపా.. పపపపాపా..
పపపపా.. పపపపాపా..

5 comments:

నాక్కూడా భలే ఇష్టం వేణుగారు ఈ పాటంటే. ఇళయరాజాగారి స్వరాలు,బాలు,జానకి గార్ల గళాలు ...ఒకదానికోసం ఒకటి పుట్టాయి.
ఈ పాటలో మాత్రం జానకిగారి గొంతులో ఫీలింగ్, బాలు గారిని బీట్ చేసినట్లనిపిస్తుంది నాకు.ముఖ్యంగా రెండవ చరణంలో

వావ్!నాకు చాల ఇష్టం అయిన పాట మా టెన్త్ ఇంటర్ రోజులు గుర్తొస్తున్నాయి అప్పట్లో ఈ సినిమా పాటలు క్రేజ్ :)

నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో పాటలు. సినిమా కూడా బావుంటుంది. చెలిమిలో వలపు రాగం, నా రాగమే, పరువమా...మూడు పాటలూ వేటికవే సూపర్. పక్కా ఇళయరాజా మార్క్ పాటలు.
మౌనగీతం సినిమలోని నాలుగు పాటల గురించి నేను అదివరకూ రాసిన టపా చూసారా?
(http://trishnaventa.blogspot.in/2010/03/blog-post_12.html )

టపా ఎత్తుగడ బాగుందండీ :) ఈ పాట చాలా సార్లు విన్నాను కానీ సినిమా తెలియదు. మీ పాటల పరిచయాలు భలే ఉంటాయి!

Mahek గారు ధన్యవాదాలు. మీరు చెప్పింది కూడా కరెక్టేననిపిస్తుందండీ...
చిన్ని గారు ధన్యవాదాలు. నిజమేనండీ కొన్ని పాటలు వింటుంటే అవి మనం మొదటిసారి విన్నప్పటి రోజులు గుర్తుచేసుకుంటాం ఆటోమాటిక్ గా బాగుంటుంది ఆ ఫీల్.
తృష్ణ గారు ధన్యవాదాలు. సినిమా నేను చూడలేదండీ మీరు చెప్పినమూడు పాటలు నాకు కూడా ఇష్టమైనవే..
రసజ్ఞ గారు ధన్యవాదాలండీ.. సినిమా కూడా బాగుంటుందని విన్నానండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.