బుధవారం, డిసెంబర్ 22, 2010

చుట్టూపక్కల చూడరా - రుద్రవీణ

కొన్ని సినిమాలు వాటిలో కొన్ని పాటలు మనసుల్లో చెరగని ముద్ర వేసి గుండెలోతుల్లో నాటుకు పోతాయి. అలాంటి ఒక పాటే రుద్రవీణ సినిమాలోని ఈ “చుట్టూపక్కల చూడరా చిన్నవాడా” అన్నపాట. ఈ పాట ముందు వచ్చే  సన్నివేశం సైతం చాలా ఆకట్టుకుంటుంది. “దేవుడు నీకిచ్చిన రెండుచేతుల్లో ఒకటి నీకోసమూ రెండోది పక్కవాడి చేయూత కోసం.” అంటూ ఆ ముసలి వ్యక్తి చెప్పిన మాటలు అతని హావభావాల సహితంగా నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. సీతారామ శాస్త్రిగారు రాసిన ఈ పాట సమస్తం యువతను సూటిగా ప్రశ్నిస్తున్నట్లుగా.. కర్తవ్యబోధ చేస్తున్నట్లుగా ఉంటుంది.


చిత్రం: రుద్రవీణ
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా ||2||
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్థం
బ్రతుకును కానీయకు వ్యర్థం ||2||

||చుట్టూపక్కల||

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా…చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా…సాంప్రదాయం అంటే
కరుణను మరిపించేదా…చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా…సాంప్రదాయం అంటే 

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
రుణం తీర్చు తరుణం వస్తే…తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా…యేరు దాటగానే
రుణం తీర్చు తరుణం వస్తే…తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా…యేరు దాటగానే

||చుట్టూపక్కల||

2 comments:

మంచి పాటని గురించి రాసారండి. ఈ సినిమాలో అన్ని పాటలూ సాహిత్య పరంగా చాలా గొప్పగా అనిపిస్తాయి. శాస్త్రి గారి కలం ఈ సినిమాలో కదం తొక్కింది!


సీతా రామ గారు శాస్త్రి, "ఒరబ్బీ తిక్క రేగిందా?" లాటి సాహిత్యం వినే ప్రజలకోసం ఇంత అద్భుతమైన కవిత్వాన్ని రాయటం తలచుకుంటే నాకప్పుడప్పుడూ మనసు బాధగా మూలుగుతుంది.

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి "పంచ నదీశ పాహిమాం" కీర్తనకి అనుకరణగా ఆయన రాసిన "మానవ సేవ ద్రోహమా" లో "గ్రీష్మ తాడిత వనాల సంతాపము గని కరిగి" అన్న వాక్యమూ, ఆ పాటలోని మానవత్వమూ ఎంత మందికి అర్ధమయిందంటారు? ఎంత మంది అప్రీషియేట్ చేసి వుంటారు?

శారద

శారద గారు నెనర్లు. శాస్త్రిగారి పాటలగురించి బాగాచెప్పారు. నిజమేనండీ అప్పట్లో "మానవ సేవ.." పాట నాకు సరిగా అర్ధమయ్యేది కాదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.