శుక్రవారం, ఫిబ్రవరి 12, 2010

దేవ దేవ ధవళాచల మందిర

భక్తి పాటలు ఎన్నున్నా, విన్న సంధర్భాన్ని పట్టో, పాటలోని మాధుర్యం వలనో కొన్ని పాటలు అలా గుర్తుండిపోతాయి అలాంటివే మరికొన్ని వచ్చినా ఆ పాట మీద అభిమానం మాత్రం చెక్కు చెదరదు. అలా నాకు బాగా నచ్చిన పాట భూకైలాస్ చిత్రం లోని "దేవ దేవ ధవళాచల మందిర" పాట. సముద్రాల గారి సాహిత్యం ప్రాసలతో సాగుతూ అలరిస్తే ఘంటసాల గాత్రం తో చక్కని సంగీతంతో ఈ పాట విన్న వారి మనసుల్లో భక్తిభావాన్ని ఇనుమడింప చేస్తూ అలా గుండెల్లో ఒదిగిపోతుంది. పాట వింటూ తన్మయత్వంతో తలాడించని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఇక రావణబ్రహ్మ గా రామారావుగారి మనోహరమైన రూపాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. శంకరుని స్తుతిస్తూ సాగే ఈ భక్తిగీతం లో చివరలో చాలా సహజంగా అలవోకగా నారాయణుని స్తుతిని కలిపేస్తారు సంగీత దర్శకులు. నారద పాత్రలో నాగేశ్వరరావు గారిని చూడటం కూడా కన్నుల పండుగే.. మహా శివరాత్రి సంధర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాట మీ కోసం.



చిత్రం: భూకైలాస్
సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

||దేవ దేవ||

పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో

||దేవ దేవ||

దురిత విమోచనా..ఆఅ..ఆఅ..ఆఆఅ..ఆఅ..అ.అ
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో

||దేవ దేవ||

నమో నమో నమో నమో నమో నమో

నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో 
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా.. ఆ ఆ ఆఆఆఅ...
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో

నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నారాయణ హరి
నారా..యణ హరి నమో నమో

4 comments:

అవును చాలా మంచి పాట.
మీకు కూడ శివరాత్రి శుభాకాంక్షలు .

మాలా కుమార్ గారు నెనర్లు.

ఎన్ని యుగాలైనా...విలువ తగ్గని, వన్నె తరగని మధుర గానం ఇది. ఈ పాటకి ఘంటసాల గారు పోసిన ప్రాణానికి మృత్యువు లేదు. నిన్న శివరాత్రి సందర్భంగా మా ఇంటిదగ్గిర పార్క్ లో జరిగిన పాటల కార్యక్రమంలో ఇలాటి వెన్నో మధుర గీతాలు విని నా చెవి తుప్పు చాలా విదిలించేసుకున్నాను.నిజంగా ఎంత మంచి పాటను గుర్తుచేసారో!

జయ గారు నెనర్లు, ఎన్ని యుగాలైనా విలువ తగ్గని వన్నె తరగని మధుర గానం ఇది !! నిజమండీ ఒక్క మాటలో చాలా బాగా చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.