"అప్పట్లో" అని అంటూ ఈ రోజు పోస్ట్ మొదలు పెడుతుంటే, హఠాత్తుగా "అహ నా పెళ్ళంట" సినిమా లో "మా తాతలు ముగ్గురు..." అని అంటూ ఆటో బయోగ్రఫీ చెప్పే నూతన్ ప్రసాద్ గారు గుర్తొచ్చి నాకే నవ్వు వచ్చింది, నేను కూడా అలా తయారవుతున్నానా అని. అయినా స్వగతం అంటూ బ్లాగడం మొదలు పెట్టాక తప్పదు కదా. అయినా ఇంచు మించు అదే రేంజ్ లో సుత్తి కొట్టినా కనీసం అందులో నూతన్ ప్రసాద్ గారి లా కట్టేసి కూర్చో పెట్టి వినింపించడం లేదు కదా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను :-)
సరే ఇక విషయానికి వస్తే మొన్న ఒక రోజు ఆన్‌లైన్ లో ఏదో న్యూస్ క్లిప్పింగ్ విడియో చూస్తుంటే, దానిలో పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి చెప్తూ "బండి కాదు మొండి ఇది" పాట ని నేపధ్యం లో వినిపిస్తున్నారు అది వినగానే ఔరా అనిపించింది. దాదాపు 30 యేళ్ళ క్రితం ఆత్రేయ గారు వ్రాసిన ఈ పాట ని ఇంకా వాడుకుంటున్నారు అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఈ సమస్య ఇంకా అలానే ఉన్నందుకు విచారించాలా, లేకా అలాంటి ఒక సమస్యని చలోక్తి గా తన పాట లో కలిపి వ్రాసిన ఆత్రేయ గారిని, కల కాలం నిలిచి పోయే స్వరాన్ని ఇచ్చిన యం.యస్.విశ్వనాథన్ గారిని మెచ్చుకోవాలా అనేది అర్ధం కాలేదు. మురళీ మోహన్ గారు నటించిన రామదండు అనే ఈ సినిమాకి బాలచందర్ గారు పర్యవేక్షణ మాత్రమే అని వుంటుంది కాని కధా వస్తువు, టేకింగ్ అంతా ఆయన స్టైలే కనిపిస్తుంది.
ఇంతకీ కొసమెరుపు ఏవిటంటే పెట్రోల్ ధరని పల్లవి లోనే ఉపయోగించినా పాటంతా ఒక పాత డొక్కు కారు తో పడుతున్న పాట్ల గురించి.
నేను చిన్నప్పుడు ఇష్టం గా విన్న పాటలలో ఇదీ ఒకటి....
సంగీతం : యం.యస్.విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
బండి కాదు మొండి ఇదీ సాయం పట్టండీ...
పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి...
గోపాలా.. గోవిందా.. రావయ్యా.. లాగయ్యా..
||బండి కాదు||
ఎక్కడికి వెళ్ళాలయ్యా...వెళ్ళినాక చెప్తానయ్యా..
చెప్పకుంటె ఎట్టాగయ్యా... చెప్పుకుంటె తంటాలయ్యా...
||ఎక్కడికి||
||బండి కాదు||
అరె ఇంగ్లాండు మహరాణి ఈ డొక్కు కార్లోనె ఊరేగి వెళ్ళిందటా...హా..
అది చూశాకా మోజెక్కీ మైసూరూ మహరాజ దర్జాగ కొన్నాడటా..
అది ఏలమేసారు నాన్న పాట పాడారు...ఏ గాణి ఇచ్చారు ఏగించుకొచ్చారు
ఇది పుట్టాక ఇట్టాగే నెట్టించు కుంటూంది నెట్టింది ఇన్నేళ్ళటా...||2||
అదే అలవాటు అయ్యిందటా...
అరె ఊగిపోతుందీ...అసలు ఊడిపోతుందీ...
ఒట్టి బొమికెలేనండి...దీన్ని మోసుకెళ్ళండీ...
మీ పెళ్ళిళ్ళు జరగాలి రా... నాయనా...
మీరు ఊరేగి వెళ్ళాలి రా..ఇది జగన్నాధ రధమేను రా...
||ఎక్కడికి||
||బండి కాదు||
గోపాలా.. గోవిందా..రేయ్ నాయ్‌నా గోపాలా..
రా రా సాయం పట్రా..నెట్టు నెట్టు నెట్టు నెట్టు..
అరె కన్నాను పిల్లల్ని అరడజను కోతుల్ని
చిన్నారి సైన్యాన్నీ..పేరెట్టాను రామదండనీ...
అరె లంక కెళ్ళింది... రాణి తోటి వచ్చిందీ...
అరె బ్రిడ్జి కట్టిందీ... ఇంత ఎవరు చేసిందీ..
మా రామదండు నెదిరించి ఏసైన్యం ఏనాడు గెలిచింది బతికిందీ...
హ హా...ఇది ఊరంతా తెలిసిందీ...
ఈ కారు చూడండీ... నకరాలు చేస్తోందీ...
దీనంతు చూడండీ... ఒక్క తోపు తోయ్యండీ...
అరె ఈ కారు కొన్నందుకూ... నేనిందర్ని కన్నందుకూ...
సరిపోయారు తోసేందుకూ....
||ఎక్కడికి||2||
||బండి కాదు||
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.