బుధవారం, ఏప్రిల్ 17, 2013

తొలిచూపూ చెలి రాసినా - రాజ్కుమార్ (1983)

కొన్ని కొన్ని సినిమాలలో ఒక పాట విపరీతంగా హిట్ అయినపుడు దాని ప్రభవెలుగులో ఆ సినిమాలోని మిగిలిన ఒకటి రెండు పాటలు బాగున్నా కూడా అవి అంతగా పాపులర్ అవ్వవు. రాజ్ కుమార్ సినిమాలోని ఈ “తొలిచూపూ చెలి రాసినా శుభలేఖా” అన్నపాట అదే కోవకి చెందుతుంది అనిపిస్తుంటుంది. ఇళయరాజా స్వరపరచిన ఈ సినిమాలోని “జానకి కలగనలేదు రాముని సతి కాగలనని” పాట చాలా ఫేమస్ అవడంతో ఈ మంచిపాట కాస్త మరుగున పడిందనే చెప్పాలి లేదంటే ఇది మరింత హిట్ అయి ఉండేది. ఇదే సినిమాలొని ఆత్రేయ రచన “తేనెకన్నా తీయనిది తెలుగు పాట” కూడా కొంచెం ఎక్కువే ఖ్యాతిపొందింది.

నాకైతే “జానకి కలగనలేదు” పాటకన్నా ఈపాటే ఎక్కువ ఇష్టం. ముఖ్యంగా ఈ పాటని బాలు జానకి గార్లు పాడలేదు పాటతో ఆడుకున్నారు. ఎనభైలలోని కొన్ని పాటలను ఇలా ఎంతో అందంగా వీళ్ళిద్దరూ ఆడుకున్నట్లుగా పాడిన పాటలు వినడం ఒక మర్చిపోలేని అనుభూతినిస్తుంది. ఆ ఇద్దరి స్వరాలను జాగ్రత్తగా గమనించి చూస్తే ప్రతిఒక్కరికీ అర్ధమవుతుందా విషయం. ప్రియభాషా అనే మాటని బాలుగారు ఒకోసారి ఒకోరకంగా పలికే విధానం కానీ చిన్నగా నవ్వుతూ అల్లరిగా ఆహా అంటూ సపోర్ట్ చేసే విధానంకానీ చూడముచ్చటగా ఉంటుంది. అలాగే జానకి గారు హిందీ లిరిక్స్ పాడిన పద్దతి చివర్లో షుక్రియా అనేమాట పలికిన విధం విని మైమరచిపోని వారుండరేమో.

వేటూరి గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం గురించి చెప్పేదేముంది రెండూ అద్భుతమే. ఈపాటని కళ్యాణి రాగంలో స్వరపరచారట వేటూరి గారు “కన్నూ కన్నూ నవకళ్యాణిలో రాగాలెన్నో పలికే” అంటూ చరణంలో మొదటిలైన్ తో ఆ విషయం చెప్పేస్తారు. ఈపాట ఓ ఆహ్లాదకరమైన ఉదయం మొదటిసారి నేను రేడియోలో విన్నాను ఆక్షణంనుండీ మనసులో అలా ముద్రపడిపోయింది, నేను తరచుగా వినేపాటలలో ఇదీ ఒకటిగా ఫిక్స్ అయిపోయింది, ఈపాట ఎప్పుడు విన్నా ఆ మొదటిసారి రేడియోలో విన్నప్పటి అనుభూతి రిపీట్ అవుతుంటుంది. ఈ చక్కని పాట ఆడియో వినాలంటే చిమటలో ఇక్కడ వినండి. యూట్యూబ్ వీడియోలో కూడా కేవలం ఆడియో మాత్రమే ఉన్న వీడియో దొరికింది అది కూడా ఇస్తున్నాను.
 

చిత్రం : రాజ్ కుమార్ (1983)
రచన : వేటూరి
సంగీతం : ఇళయ రాజా
గానం : బాలు, జానకి
రాగం : కళ్యాణి

ఆఆఆఆఆఆఆఆఆ..
ఆహాహ.. ఆహాహ.. ఆహాహ.. 

తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది.. ప్రియ భాషా
పలుకే లేనిది.. ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ

కన్నూ కన్నూ నవకళ్యాణి లో.. రాగాలెన్నో పలికే
క్యా(क्या)
అందాలన్నీ బిగి కౌగిళ్ళకే.. రావాలనీ అలిగే
బనే మేరే ప్రాణ్ మన్ మధ్ కే తీర్ ఏహై ప్రేమ్ కా సార్
(बने मेरे प्राण मन मध् के तीर ऐहै प्रेम का सार)
ప్రాణాలన్ని మరు బాణా లైదుగా చేసే ప్రేమ కావ్యం
అఛ్చా(अच्चा)
తొలి పాట చెలికంకితం..  చెలి నీడ నా జీవితం...
ఆరారు కాలాల కిది కామితం

నజరోం సే ఆహ దిల్ నే దియా నజరానా ఆహహ..
(नजरॊं सॆ ఆహ दिल नॆ दिया नजराना అహహ..)
న హో సకా ఔర్ దేనా (न हॊ सका और दॆना)
న హో సకా ఔర్ దేనా దేనా (न हॊ सका और दॆना.. देना)
నజరోం సే ఉహూ.. దిల్ నే దియా నజరానా..
(नजरॊं सॆ ఉహూ.. दिल नॆ दिया नजराना)

బృందావనీ సుమ గంధాలతో శృంగారాలే వలచీ
ఫిర్(फिर)
శిల్పావనీ లయ లాస్యాలతో సౌందర్యాలే తలచీ
 సాంఝ్ సవేరే పూఛూంగీ మై ఖిల్ కవల్ సే తుమ్హే..
(सांझ सवॆरॆ पूछूंगी मैं खिल कवल सॆ तुम्हॆं)

కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమ హారం...
షుక్రియా (शुक्रीया)
కుసుమించే చెలి యవ్వనం..  నా మదికే నీరాజనం..
ఏడేడు జన్మాలకిది శాశ్వతం..

తొలి చూపు చెలి రాసినా శుభలేఖ
నజరోం సే దిల్ నే దియా నజరానా
(नजरॊं सॆ दिल नॆ दिया नजराना)
పలుకే లేనిది ప్రియ భాషా
న హో సకా ఔర్ దేనా దేనా
(न हॊ सका और देना.. देना)
తొలిచూపు చెలి రాసిన శుభలేఖ
నజరోం సే దిల్ నే దియా నజరానా
(नजरॊं सॆ दिल नॆ दिया नजराना)

హిందీ లిరిక్స్ సరి చేసి పంపిన ఫ్రెండ్ కి ధన్యవాదాలు. 

5 comments:

మళ్ళీ రేడియో లో విన్న రోజుల్ని గుర్తు చేశారు.

బాగు-:)బాగు-:).... నిజం చెప్పారు....

మంచి పాట. రేడియోలో తరచూ వినేవాళ్ళం. మధ్యలో ఆ హిందీ ఎందుకో తెలీలేదు.. కథలో హీరోయిన్ హిందీ అమ్మాయా?

నాకూ ఇష్టం ఈ పాట బాగుంది మీ పరిచయం (రాధిక నాని)

bpubs గారు, కార్తీక్ గారు, తృష్ణగారు, రాధిక గారు ధన్యవాదాలు.
నేను సినిమా చూడలేదు తృష్ణగారు, బహుశా సెకండ్ హీరోయిన్ హిందీ అమ్మాయి అయి ఉండచ్చు :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.