ఆదివారం, జూన్ 24, 2018

శ్రీ గౌరి శ్రీ గౌరియే...

గంగమ్మ ఆ శివయ్య శిరమెక్కి నాట్యమాడినా కూడా శ్రీ గౌరి శ్రీ గౌరియే అని కీర్తించే ఈ చక్కని నృత్యరూపకం విచిత్ర దాంపత్యం చిత్రం లోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విచిత్ర దాంపత్యం (1971)
సంగీతం : అశ్వథ్ధామ   
సాహిత్యం : సి.నారాయణరెడ్డి     
గానం : సుశీల 

శ్రీ గౌరి శ్రీ గౌరియే
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే

సతిగా తనమేను చాలించి
పార్వతిగా మరుజన్మ ధరియించి
సతిగా తనమేను చాలించి
పార్వతిగా మరుజన్మ ధరియించి
పరమేశునికై తపియించి
పరమేశునికై తపియించి
ఆ హరు మేన సగమై పరవశించిన

శ్రీ గౌరి శ్రీ గౌరియే 
 
నగకన్యగా తాను జనియించినా
జగదంబయైనది హైమవతి
నగకన్యగా తాను జనియించినా
జగదంబయైనది హైమవతి

సురలోకమున తాను ప్రభవించినా
తరళాత్మయైనది మందాకిని

ఒదిగి ఒదిగి పది పదములందు
నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతి సిగను దూకి
నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి
చలిత జీవన తరంగ రంగ గంగ
ధవళాంశు కీర్తి గౌరి
నవఫేనమూర్తి గంగ
కల్పాంతమైన
భువనాంతమైన
క్షతి యెరుగని
మృతి యెరుగని నిజమిది
శ్రీ గౌరి శ్రీ గౌరియే.. 

 

శనివారం, జూన్ 23, 2018

నలుగురు నవ్వేరురా...

కన్నయ్య చిలిపి అల్లర్లని వద్దని అనలేకా కావాలని నలుగురిలో అల్లరిపాలు కాలేక ఆ నల్లనయ్యకి ఈ గోపెమ్మ విన్నపాలేమిటో ఈ చక్కని నృత్యరూపకం ద్వారా మనమూ విందామా. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విచిత్ర కుటుంబం (1969)
సంగీతం : టి.వి.రాజు   
సాహిత్యం : సి.నారాయణరెడ్డి    
గానం : సుశీల

నలుగురు నవ్వేరురా స్వామీ
నలుగురు నవ్వేరురా గోపాల
నడివీధిలో నా కడకొంగు లాగిన
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా.. అవ్వ..
నలుగురు నవ్వేరురా..

చల్లచిలికే వేళ చక్కిలిగిలి చేసి
దండలల్లే వేళ రెండు కళ్ళూ మూసి
చల్లచిలికే వేళ... చల్లచిలికే వేళ..
చల్లచిలికే వేళ చక్కిలిగిలి చేసి
దండలల్లే వేళ రెండు కళ్ళూ మూసి
ఒంటిగ యేమన్నా... ఆఆఅ...ఆఆఅ..
ఒంటిగ యేమన్న ఊరకుంటిని గాని
రచ్చపట్టున నన్ను రవ్వచేయ పాడికాదులే

నలుగురు నవ్వేరురా గోపాలా
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..ఆఆఅ...
నలుగురు నవ్వేరురా...

పొన్నచెట్టున చేరి పొంచినట్టుల కాదు
చీరెలను కాజేసి కేరినట్టుల కాదు
పొన్నచెట్టున చేరి పొంచినట్టుల కాదు
చీరెలను కాజేసి కేరినట్టుల కాదు
కన్నెమనసే వెన్న గమనించరా కన్న
అన్ని తెలిసిన నీవె ఆగడాలు సేయనేల ఔరా

నలుగురు నవ్వేరురా గోపాలా
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..ఆఅ..ఆఅ.
నలుగురు నవ్వేరురా.. అవ్వ
నలుగురు నవ్వేరురా...ఆఆఅ..
శుక్రవారం, జూన్ 22, 2018

తెలుగు జాతి మనది...

విశాలాంధ్రను అభిలషిస్తూ రూపొందించిన ఓ చక్కని నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తల్లా పెళ్ళామా (1970)
సంగీతం : టి.వి.రాజు    
సాహిత్యం : సి.నారాయణరెడ్డి     
గానం : ఘంటసాల

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న

వచ్చిండన్న వచ్చాడన్న
వచ్చిండన్న వచ్చాడన్న
వరాల తెలుగు ఒకటేనన్న

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమెవరిది
పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమెవరిది
 మూడు కొండ్రలూ కలిపి దున్నిన
ముక్కారు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలూ
ఐదుకోట్ల తెలుగువారిది.

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ
నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపులందుకొని
సత్యాగ్రహాలు చేశాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట
స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి
ధీటే లేదనిపించాము

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ఇంటిలోన అరమరికలు వుంటె
ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటె
కనుగ్రుడ్డు పెరికి వేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను
పగలగొట్టవద్దు
పాలు పొంగు మన తెలుగు గడ్డను
పగలగొట్టవద్దు

నలుగురిలో మన జాతి పేరును
నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది 

గురువారం, జూన్ 21, 2018

వెన్నెలరేయి చందమామ...

వెన్నెల రాత్రి ఈ యువ జంట ఆడుకునే కబుర్లేమిటో మనమూ విందామా, రంగులరాట్నం చిత్రంలోని ఈ చక్కని పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రంగులరాట్నం (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు   
సాహిత్యం : కొసరాజు    
గానం : బి.గోపాలం, జానకి   

వెన్నెలరేయి చందమామ
వెచ్చగనున్నది మామ
మనసేదోలాగున్నది
నాకేదోలాగున్నది

తీరిచి వెన్నెల కాయువేళ
దోరవయసులో పిల్లా
నీకాలాగే వుంటది
మనసాలాగే వుంటది.

చల్లని గాలి తోడురాగా
సైగలతో నువు చూడగా
కనుసైగలతో వలవేయగా
గుండెలదరగా నీతో చాటుగా
గుసగుసలాడగ సిగ్గౌతున్నది

వెన్నెలరేయి చందమామ
వెచ్చగనున్నది మామ
మనసేదోలాగున్నది
నాకేదోలాగున్నది

నడకలతోటి వియ్యమంది
నవ్వులతో నను పిల్వగా
చిరునవ్వులతో పక్క నిల్వగా
చిన్ననాటి ఆ సిగ్గు ఎగ్గులు
చిన్నబుచ్చుకొని చిత్తైపోవటే

తీరిచి వెన్నెల కాయువేళ
దోరవయసులో పిల్లా
నీకాలాగే వుంటది
మనసాలాగే వుంటది.

తీయ తీయగా సరసమాడి
చేయి చేయి కల్పుతూ
మన చేయి చేయి కల్పుతూ
మాటలతో నువు మత్తెక్కించితే
మనసే నాతో రాలేనన్నదోయ్

వెన్నెలరేయి చందమామ
వెచ్చగనున్నది మామ
మనసేదోలాగున్నది
నాకేదోలాగున్నది


బుధవారం, జూన్ 20, 2018

చిరునవ్వుల కులికేరాజా...

అమాయకురాలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు   
సాహిత్యం : కొసరాజు    
గానం : సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి  

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

కనకానికి లొంగనివాణ్ణీ
కాంతంటే పొంగనివాణ్ణీ
కనకానికి లొంగనివాణ్ణీ
కాంతంటే పొంగనివాణ్ణీ
ముచ్చటైన ముద్దుల గుమ్మ
మోజుదీర వలచిందయ్యా
చేతిలోన చెయి వేయమంది
చెప్పినట్టు వినుకోమంది 
బుద్ధి కలిగి ఉండకపోతే
బుగ్గపోట్లు తింటావంది

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

అంతస్థులు చూడకుండా
ఐశ్వర్యం ఎంచకుండా
అంతస్థులు చూడకుండా
ఐశ్వర్యం ఎంచకుండా
చక్కనైన నడవడి చూచీ
చల్లని మనసిచ్చాడమ్మా
హజంతోటి నడిచావంటే
చులకనగా చూశావంటే
మడత చపాతీలు వేసి
బడితె పూజ చేస్తాడమ్మా

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

మా కష్టం తెలిసిన బాబు
నీ జతగాడయినాడమ్మా
చిలకా గోరింకల్లాగ
కిలకిలమని కులకండమ్మా
సరసాల్లో గుమ్మయిపోయి
జలసాల్లో చిత్తయిపోయి
మమ్ముకాస్త మరిచారంటే
దుమ్ము దులిపి వేస్తామయ్యో

చిరునవ్వుల కులికేరాజా
సిగ్గంతా ఒలికే రాణి
సరిజోడూ కుదిరిందిలే
సరదాలకు లోటే లేదులే

మంగళవారం, జూన్ 19, 2018

ఔనంటారా మీరు కాదంటారా...

లోకం పోకడలను యువతరం తీరును ఎండగట్టి, స్వతంత్ర భారతంలో ప్రజలెలా మెలగాలో తెలియజేసే ఈ చక్కని నృత్యరూపకం మాంగళ్యబలం చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాంగళ్యబలం (1959)
సంగీతం : మాస్టర్ వేణు  
సాహిత్యం : కొసరాజు   
గానం : పి.లీల, సుశీల

ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా
ఏమంటారు వట్టి వాదంటారా
పేరుకు మాత్రం మీరు పెద్దమనుషులంటారు
ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

ముత్తాతల అర్జనతోటి మొనగాళ్ళుగ పోజులు వేసి
ముత్తాతల అర్జనతోటి మొనగాళ్ళుగ పోజులు వేసి
సూటు బూటు నీటుగ తొడిగి సొత్తంతా క్షవరంచేసి
కష్టం తెలియక గాలికి తిరిగే కబుర్ల రాయుళ్ళున్నారంటే


ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

ఎంతెంతో ఆశ్రయించి నయమ్ముగ జనులను మురిపించి
ఎంతెంతో ఆశ్రయించి నయమ్ముగ జనులను మురిపించి
బలే బలే పదవుల సాధించి హుషారుగ పైసా గడియించి
ప్రజలంటే మరచి తమ స్వార్థంచూచే 
ప్రజావంచకులు వున్నారంటే

ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

ఎన్నెన్నో ఆశలతోటి ఉన్న ఆస్థి బేరంపెట్టి
ఎన్నెన్నో ఆశలతోటి ఉన్న ఆస్థి బేరంపెట్టి
తలిదండ్రులు పంపబట్టి సరదాగా సిగరెట్ పట్టి
కాఫీ హోటల్ ఖాతాబెడుతూ 
చదువుకు సున్నా చుడతారంటే

ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

డాబైన వేషమేసి పసందుగ టీపార్టీల్ చేసి
డాబైన వేషమేసి పసందుగ టీపార్టీల్ చేసి
పైవాళ్ళను జేబులోన వేసి ప్రజాధనమంతా భోంచేసి
మోసాలు చేసి జగమంత రోసి 
పెనుముద్రపడ్డ ఘనులున్నారంటే

ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా

త్యాగం చేసి సంపాదించిన
స్వతంత్ర ఫలితం పొందాలంటే
జనసామాన్యం సమానమ్ముగ
సౌఖ్యంతో తులతూగాలంటే
స్వలాభాన్ని విడనాలండి
జాతికి ప్రాణం పోయాలండి
దీక్షబట్టి పని చెయ్యాలండి
దేశ గౌరవం పెంచాలండి


ఔనంటారా మీరు కాదంటారా
ఔనంటారా మీరు కాదంటారా  


సోమవారం, జూన్ 18, 2018

భారతవీరా ఓ భారతవీరా...

భారత యువతకు చక్కని సందేశమిచ్చే ఈ నృత్యరూపకం భలే రాముడు చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలేరాముడు (1956)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు  
సాహిత్యం : సదాశివ బ్రహ్మం  
గానం : పి.లీల, బృందం

భారతవీరా ఓ భారతవీరా
భారతవీరా ఓ భారతవీరా
లేరా మేల్కొనవేరా సోదరా భారతదేశం నీదేరా
భారతదేశం నీదేరా ఈ భారతదేశం నీదేరా

ఓ భారతవీరా
ఓ భారతవీరా ఓ భారతవీరా

స్వతంత్ర భానుడు ఉదయించె స్వతంత్ర వాయువు ప్రసరించె
స్వతంత్ర భానుడు ఉదయించె స్వతంత్ర వాయువు ప్రసరించె
ప్రపంచమంతా అఱ్ఱులెత్తి నిను పరికిస్తోందీ ఆశ్చర్యముగా
ప్రపంచమంతా అఱ్ఱులెత్తి నిను పరికిస్తోందీ ఆశ్చర్యముగా

ఓ భారతవీరా
ఓ భారతవీరా ఓ భారతవీరా
 

నడుము కట్టి మున్ముందుకు నడిచి నడిపించాలి దేశాన్ని
నడిపించాలీ దేశాన్నీ నడిపించాలీదేశాన్ని
వడివడిగా సిరి వర్ధిలజేసి సడలించాలి దరిద్రాన్ని  
 సడలించాలి దరిద్రాన్ని సడలించాలి దరిద్రాన్ని
గంగ యమున గోదావరికృష్ణా మహానదులు మరలించాలి 
మహానదులు మరలించాలి మహానదులు మరలించాలి
పొంగి సస్యశ్యామలమై భువి బంగారమె పండించాలి 
భువి బంగారమే పండించాలి భువి బంగారమే పండించాలి

ఓ భారతవీరా
ఓ భారతవీరా ఓ భారతవీరా

యంత్రాగారపు పొగగొట్టాలు అంతరిక్షమున కందాలి
యంత్రాగారపు పొగగొట్టాలు అంతరిక్షమున కందాలి
అంతులేని వృత్తి వుద్యోగాలందరికీ కల్పించాలి
అంతులేని వృత్తి వుద్యోగాలందరికీ కల్పించాలి
శాంతి సత్యముల శరణ్యములని యీ జగమంతా చాటాలి
యీ జగమంతా చాటించాలి యీ జగమంతా చాటించాలి
భారతమాతా ప్రపంచమునకే తలమానికమనిపించాలి
భారతమాతా ప్రపంచమునకే తలమానికమనిపించాలి
భారతమాతా ప్రపంచమునకే తలమానికమనిపించాలి


భారతవీరా ఓ భారతవీరా ఓ భారతవీరా 

 

ఆదివారం, జూన్ 17, 2018

మొక్కజొన్న తోటలో...

మనసైన బంగరి మావను వద్దకు రారమ్మని కబురు పెడుతూ వాడికి ఈ చిన్నది ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో మనమూ విందామా. అదృష్టవంతులు చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అదృష్టవంతులు (1969)
సంగీతం : కె.వి.మహదేవన్  
సాహిత్యం : కొనకళ్ళ వెంకటరత్నం  
గానం : సుశీల

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మామయ్యా
నువ్వు మరువకు మరువకు మామయ్యా

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మామయ్యా
నువ్వు మరువకు మరువకు మామయ్యా

చుక్కలన్ని కొండమీద సోకు చేసుకునే వేళ
చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకునే వేళ
చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ
పొద్దు వాలినంతనే సద్దుమణగనిచ్చిరా
పొద్దు వాలినంతనే సద్దుమణగనిచ్చిరా
వేళదాటి వస్తివా వెనక్కి తిరిగిపోతివా
తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా
తప్పదు తప్పదు మామయ్యా 

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మామయ్యా
నువ్వు మరువకు మరువకు మామయ్యా

మొన్నరేతిరి జాతరలో కన్ను గీటినపుడు
వంగతోట మలుపు కాడ కొంగు లాగినపుడు
ఆ... ఓ... ఊఁ...
మొన్నరేతిరి జాతరలో కన్ను గీటినపుడు
వంగతోట మలుపు కాడ కొంగు లాగినపుడు
కసిరి తిట్టినానని ఇసిరి కొట్టినానని
కసిరి తిట్టినానని ఇసిరి కొట్టినానని
నలుగురిలో చిన్నబోయి నవ్వులపాలైతివా
తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా
తప్పదు తప్పదు మామయ్యా 

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మామయ్యా
నువ్వు మరువకు మరువకు మామయ్యా

గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెఱువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా
గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెఱువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా
అయిన వాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను
అయిన వాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను
గుట్టు బయట బెడితివా గోలగాని జేస్తివా
తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా
తప్పదు తప్పదు మామయ్యా 


శనివారం, జూన్ 16, 2018

ఉషాపరిణయం(యక్షగానం)...

మల్లీశ్వరి చిత్రంలోని ఉషాపరిణయం యక్ష గానాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : కమలాదేవి, భానుమతి, బృందం

శ్రీ సతితో సరసీజనయనువలె
చెలువున దేవేరితో.. ఆఆఆఅ..
శ్రీ సతితో సరసీజనయనువలె
చెలువున దేవేరితో కొలువున
చెలువున దేవేరితో....
చెలువున దేవేరితో వెలయగ
చెలువున దేవేరితో....

రాజాధిరాజ, వీరప్రతాప, శ్రీకృష్ణరాయభూపా
సకలాంధ్ర నిఖిల కర్ణాట విపుల సామ్రజ్య రత్నదీపా
సామంత మకుట మాణిక్య కిరణ సందీప్త భవ్య చరణా
సాహిత్య నృత్య సంగీత శిల్పసల్లాప సరస భవనా
కళలకు నెలవగు మా దేవి సెలవైన పూని తలపైన
కరుణింపగ తిలకింపగ కడుయింపుగ నటియింపగ
కవిపండిత శ్రితకల్పభూజ నవభోజా.. నవభోజా..
సరసమధురముషా పరిణయమును
సరసమధురముషా పరిణయమును
దేవర సన్నిధి, కారుణ్య శేవధి,
దేవర సన్నిధి, కారుణ్య శేవధి,
చెలువున దేవేరితో కొలువున
చెలువున దేవేరితో వెలయగా...
చెలువున దేవేరితో


మగువాఅ...ఆఆఆఆఅ....
మగువా నీ జనకునకును
పగవాడు గదమ్మ కృష్ణు పౌత్రుడు.. వానిన్..
తగునా వలవగ, వానికి..
అగునా ఈ యంతిపురమునందడుగిడగా
అడుగిడిన నీ ప్రియు
డయ్యో మనగలడా
అడుగిడిన నీ ప్రియు
డయ్యో మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా
అడుగిడిన మనగలడా

నా ప్రాణేశ్వర నవమదనా స్మేర సుందరానన
నా ప్రాణేశ్వర నవమదనా స్మేర సుందరానన
నా ప్రాణేశ్వర నవమదనా
ఎన్ని నాళ్ళు నిన్ను కోరి వేచితి
ఎన్ని నాళ్ళు నిన్ను కోరి వేచితి
మనసులో వలపులు దాచుకుని
నా ప్రాణేశ్వర నవమదనా స్మేర సుందరానన
నా ప్రాణేశ్వర నవమదనా
నా ప్రాణేశ్వర నవమదనా 
ప్రాణేశ్వర నవమదనా 
ప్రాణేశ్వర నవమదనా 
ప్రాణేశ్వర నవమదనా  
ఆఆఆఆఆ.....ఆఆఆఆఆ....

 

శుక్రవారం, జూన్ 15, 2018

నీకో తోడు కావాలి...

చదువు, సంస్కారం, గుణగణాలే ఎన్నటికీ చెదరని ఆస్తులని చాటి చెప్పే ఓ సరదా ఐన నృత్య రూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర 
గానం : ఘంటసాల, సుశీల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
నన్నే నీదాన్ని చేసుకోవాలి

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
నన్నే నీదాన్ని చేసుకోవాలి

నవనాగరీక జీవితాన తేలుదాం
నైటుక్లబ్బులందు నాట్యమాడి సోలుదాం
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి
నేను అంతకన్న అప్టుడేటు బేబిని

వగలాడి నీకు తాళి బరువు ఎందుకు
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను
ఏదొ హారుమని వాయిస్తూ పాడుకుంటాను

దనిస నిదనిప మగదిస దిగమప
నేను చదువులేనిదాననని అలుసు నీకేల
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల

నీతో వియ్యం దినదినగండం
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని

ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

సిరులూ నగలూ మాకు లేవోయి
తళుకూ బెళుకుల మోజు లేదోయి
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు

ధనరాశి కన్న నీ గుణమే మిన్న
నీలో సంస్కారకాంతులున్నాయి  

నీకో బ్రూటు దొరికింది 
మెడలో జోలి కడుతుంది
ఈమె కాలిగోటి ధూళి పాటి చేయరు 
ఓ త్వరగా దయచేస్తే కోటి దండాలు 

నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి

ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ
హాయ్‌ నిన్నే నాదాన్ని చేసుకుంటాను


గురువారం, జూన్ 14, 2018

ముందటి వలె నాపై...

ఈ అందమైన క్షేత్రయ్య పదాన్ని ఆత్మగౌరవం చిత్రంలో ఎంత అందంగా అభినయించారో చూద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : క్షేత్రయ్య పదం  
గానం : సుశీల

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలిక నేలరా నా సామి
ముచ్చటలికనేలరా
ఎందుకు మొగమిచ్చకపు మాటలాడేవు
ఎందుకు మొగమిచ్చకపు మాటలాడేవు
ఏరా మువ్వగోపాల మేరగాదుర నా సామి

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలికనేలరా

చిన్ననాట నుండి చేరినదెంచక
నను చౌక చేసేది న్యాయమా
నను చౌక చేసేది న్యాయమా
వన్నెకాడ నీదు వంచనలెరుగానా
నిన్నన పని లేదు నే చేయు పూజకు

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలికనేలరా

పిలువనంపిన రావు పిలచిన గైకోవు
పలుమారు వేడిన పలుకవు
వలపు నిలుపలేక చెలువుడవని నిన్నే
అఆఆఆ....ఆఆఆఆఆఅ.....
వలపు నిలుపలేక చెలువుడవని నిన్నే
తలచి తలచి చాలా తల్లడిల్లుటేకాని

ముందటి వలె నాపై నెనరున్నదా సామి
ముచ్చటలిక నేలరా నా సామి
ముచ్చటలికనేలరా 

బుధవారం, జూన్ 13, 2018

ఓ ఉంగరాల ముంగురుల...

తనపై అలిగిన ప్రేయసి అలక పోగొట్టడానికి మాటల గారడితో అతనెలా బుజ్జగించాడో చెప్పే ఈ హుషారైన నృత్య రూపకం డాక్టర్ చక్రవర్తి చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరధి 
గానం : మాధవపెద్ది, సుశీల, కోరస్

ఓహోహోహో.. హోయ్...
ఆహాహాహాహా...ఆఆఅ... హాయ్
ఓహోహోహోహో.. హాయ్.. 
ఆహి ఆహి ఆహీ.. ఓ ఆహి ఆహి ఆహీ..
ఆహి ఆహి ఆహీ.. ఓ ఆహి ఆహి ఆహీ..
ఆహి ఆహి ఆహీ.. ఓ ఆహి ఆహి ఆహీ.. 
ఓ భల్లే భల్లే భల్లే..
ఆఆఅ..ఆఆఅ...ఆఅ..
ఆహా ఆహాహ ఆహాహా
ఆఆఅ..ఆఆఅ...ఆఅ..
ఆహా ఆహాహ ఆహాహా

ఆహా.. ఆహా..
ఓ ఉంగరాల ముంగురుల రాజా
నీ హంగు చూసి పొంగిపోను లేరా !
ఓ ఉంగరాల ముంగురుల రాజా
నీ హంగు చూసి పొంగిపోను లేరా !
హోయ్..
నా సామీరంగా దణ్ణవోయీ హోయి
నా జోలికింక రాకోయీ హాయి ..హాయి ..!
ఓ సిన్నోడ సిన్నోడ ఓ సిన్నోడా

ఓ బొంగరాల బుగ్గలున్న దానా
నీ కొంగు తాకి పొంగిపోతి జాణా !
ఓ బొంగరాల బుగ్గలున్న దానా
నీ కొంగు తాకి పొంగిపోతి జాణా !
హోయ్ హోయ్..
నువ్వు కస్సుమంటే తాళలేనే .. ఒ హాయి
నీ పొందుగోరి వచ్చినానే ! హాయ్.. హాయ్
ఓ చెలియా ! ఓ చెలియా ! ఓ చెలియా

ఆహ ఆహ ఆహ ఓహో ఓహో ఓహో
ఆహాహా ఆహాహా ఆహాహా..

నీ కైపు కళ్ళతో నీ కొంటె నవ్వుతో
గారడీ చేశావు భలే భలే
నీ తీపి మాటలు నీళ్ళలో మూటలు
నిన్ని౦క నమ్మనోయి !

నా సిలకా...హొయ్ హొయ్ ..
నీ అలకా.. హాయ్ హాయ్ .
తెచ్చిందిలే అందం.. నా కళ్ళు చూడవే
నీ బొమ్మ ఆడేనే మనసంతా నీవేనే !
పో పోవోయ్...
ఓ పిల్లోయి...
కిల్లాడి చాలులే...

హాయ్ ఓ బొంగరాల బుగ్గలున్న దానా
నీ కొంగు తాకి పొంగిపోతి జాణా ! హోయ్ హోయ్
నువ్వు కస్సుమంటే తాళలేనే .. ఒహాయి
నీ పొందుకోరి వచ్చినానే! హాయ్ హాయ్
ఓ చెలియా ! ఓ చెలియా ! ఓ చెలియా

హోయ్య..
ముచ్చట్లు గాలితో మురిపాలు పూలతో
నటనలు నాతోనా
సరసాలు సుక్కతో సరదాలు మబ్బుతో
సైయ్యాట నాతోనా !
ఇటు సూడవే... హోయ్ హోయ్
నీ తోడులే.. హాయ్ హాయ్
దాసుడు నీ వాడే...
నువ్వుంటే పక్కన మనసెంతో చల్లన
నా రాణి నీవేనే
ఓ రాజా..
నా రోజా..
ఈ రోజే హాయ్.. హాయ్..

ఓ ఉంగరాల ముంగురుల రాజా
నీ హంగు చూసి పొంగిపోను లేరా !
ఓ ఉంగరాల ముంగురుల రాజా
నీ హంగు చూసి పొంగిపోను లేరా !
నా సామీరంగా దణ్ణవోయీ హోయి
నా జోలికింక రాకోయీ హాయి ..హాయి ..!
ఓ సిన్నోడ ఓ సిన్నోడ ఓ సిన్నోడా

ఆహా ఆహా ఆఆ హోయ్..
ఓహో ఓహో ఓఓ హాయ్
ఆహా అహ ఓహో ఒహొ హయ్
ఆహా అహ ఓహో ఒహొ హయ్
ఆహా ఆహా ఆహా.. ఓహో ఓహో ఓహో
ఆహా ఆహా ఆహా.. ఓహో ఓహో ఓహో
ఓ భల్లే భల్లే భల్లే
ఓ భల్లే భల్లే భల్లే
హో..య్య్...


మంగళవారం, జూన్ 12, 2018

వినరా భారత వీర...

ఎందరో శ్రమించి సాధించిన స్వాతంత్ర్య ఫలాలను ప్రజలందరికీ అందనివ్వకుండా కొందరు పెద్దలు ఎలా స్వాహా చేస్తున్నారో విశదీకరించే ఈ నృత్యరూపకం పూలరంగడు చిత్రంలోనిది. ఈ సినిమా వచ్చి యాభై ఏండ్లు గడచినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదనే చెప్పచ్చేమో. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పూలరంగడు (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు 
గానం : ఘంటసాల, సుశీల, కోరస్ 

వినరా భారత వీర సోదరా విజయము నీదేరా 
తందానతానా 
 కళ్ళు తెరచి నీదేశ పరిస్థితి ఒక్కసారి కనరా
తందానతానా
నీ తాతలు తండ్రులు దేశం కోసం త్యాగం చేశారూ
స్వాతంత్ర్యమే మన జన్మహక్కని చాటి చెప్పినారూ
తందాన తానా
బానిసతనమునకన్నా మరణమే మేలని అన్నారూ
మరఫిరంగులా గుండు దెబ్బలకు రొమ్ములొడ్డినారూ
తందాన తానా  
పరాయి దొరలను ధర్మ యుద్ధమున పారద్రోలినారూ
అమూల్యమైన స్వతంత్రమ్ము నీకప్పగించినారూ

వినరా భారత వీర సోదరా విజయము నీదేరా
కళ్ళు తెరచి నీదేశ పరిస్థితి ఒక్కసారి కనరాఇన్ని త్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్ర్య ఫలితం తమ బిడ్డలకైనా దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ! ఎన్నో కలలు గన్నారు ! 

ఏమిటో ఆ కలలు
కూడు గుడ్డలకు లోటు వుండదని 
తందానా తందాని తందనా 
పాడి పంటలకు తరుగు ఉండదని
 
తందానా తందాని తందనా 
 కరువు కాటకం మొఖం చూపదని 
తందానా తందాని తందనా 
 కన్నబిడ్డలకు సుఖం కల్గునని
తందానా తందాని తందనా 
అంతులేని ఆనందంలోన పొంగిపోయినారు

వినరా భారత వీర సోదరా విజయము నీదేరా 

 
పాపం వెర్రిబాగుల వాళ్ళు సత్యకాలం వాళ్ళు మన కళ్ళెదుట కనిపిస్తూనే ఉందిగా కల 

 
ఆరుగాలము శ్రమపడు రైతుకు అన్నము చాలదురా  
తందానా.. తందానా దేవ నందనానా..
రెక్కలు ముక్కలు చేసే కూలికి డొక్కే నిండదురా
తందానా.. తందానా దేవ నందనానా..
ఫైళ్ళలో మునిగే గుమస్తాలకు పస్తులబాధేనా
తందానా.. తందానా దేవ నందనానా..
 అశాంతిలోన దేశం అంతా అలమటించ వలెనా 
తందానా.. తందానా దేవ నందనానా..
  అరె ప్రజా ప్రభుత్వం వచ్చినందుకు ఫలితం ఇదియేనా  
తందానా.. తందానా దేవ నందనానా..

 దేవుడు వరమిచ్చాడు కాని అది భక్తులకు అందలేదు, అందుకని దేవుడ్ని నిందిస్తామా మన సుఖం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూంది 

ఏమిటబ్బా ఆ కృషి 

ప్రాజెక్టులే కట్టిరి బంజరు భూములనే పండించిరి
ఫ్యాక్టరీలనే పెట్టిరి ఎంతో ఉత్పత్తినే పెంచిరి

దేశ దేశాలన్నీ తిరిగి అప్పులెన్నో తెచ్చారూ
ప్రజల సౌఖ్యం కోసం చక్కని ప్లానులెన్నో వేశారూ
పల్లెసీమల బాగుకోసమై పంచాయతులను పెట్టారూ
విద్యకోసం వైద్యం కోసం వసతులెన్నో చూపారూ 

 
ఈ విధంగా ప్రజల సుఖం కోసం ఎంతోడబ్బు ఖర్చు పెట్టారంటావ్... మరి ఆ డబ్బంతా ఏమైపోతోందో


స్వార్ధపరులెందరో... తందానా...
సమయము చూశారు
... తందానా...
దేశ సంపదనంత
... తందానో...
 దిగమింగినారండి... తందానా...
పదిమంది పెద్దలూ
... తందానో...
పంచుకున్నారండీ
... తందానా...
లంచగొండులతోటి
... తందానో...
లాలూచి పడ్డారు
... తందానా...
కోటాలు పర్మిట్లు పట్టారూ 
కోట్లు కోట్లు కూడబెట్టారు
కోటాలు పర్మిట్లు పట్టారూ 
కోట్లు కోట్లు కూడబెట్టారు 
 
  బియ్యంలోన రాళ్ళను కలిపి
సిమెంటులోన బూడిద గలిపి
మంచి వెన్నలో మైదా కలిపి
కల్తీ నకిలీ మందులు అమ్మి 
కల్తీ నకిలీ మందులు అమ్మి
మాటలు తీయగ చెబుతారూ
మనుషుల ప్రాణాల్ తీస్తారు
మాటలు తీయగ చెబుతారూ
మనుషుల ప్రాణాల్ తీస్తారు 

 
అవసరమైన వస్తువులన్నీ అక్రమమ్ముగా చాటున పెట్టి
రోజు రోజుకు ధరలను పెంచి ప్రజల నిలువునా దోపిడీ చేసి
ప్రజల నిలువునా దోపిడీ చేసి 
జేబులు పెద్దవి చేశారు బొజ్జలు బాగా పెంచారూ
 జేబులు పెద్దవి చేశారు బొజ్జలు బాగా పెంచారూ 
 
బాల పాపల నోళ్ళు గొట్టి పాలడబ్బాల్ దాచిపెట్టి
బ్లాకు మార్కెట్ లోన అమ్మేరూ
పాపల సొమ్మున పాలు పంచి పుణ్యం కొంటారు
పసివాళ్ళ వుసురు తగులుతుందని మరచే పోతారు 

 
ఏం గురూ ఈ పాపం ఇట్లా పెరిగి పోవలసిందేనా మనం గుడ్లప్పగించి చూస్తూ వూరుకోవలసిందేనా

ఏమన్నావ్ 
 
ఎందరో శ్రమపడి పెంచిన సంపదరా.. తందానా..
కొందరు పంచుక మ్రింగిన చెల్లదురా
..  తందానా..
నీకూ నాకూ లేని ఆ హక్కు
.. తందానా..
ఎవ్వడు వాడికి ఇచ్చాడో చెప్పు
.. తందానా..
సంఘద్రోహుల ఆట కట్టవలెరా
.. తందానా..
చీడపురుగులను వదల కొట్టవలెరా
.. తందానా..
ధైర్యంతో ముందడుగు వేయవలెరా
.. తందానా..
జాతినంతనూ కూడదీయవలెరా
.. తందానా..
అప్పుడు దేశం బాగుపడును గదరా
.. తందానా..
శాంతి సౌఖ్యమున ఓలలాడు గదరా
.. తందానా..
శాంతి సౌఖ్యమున ఓలలాడు గదరా.. తందానా..
తధిమి తత్ తధిమితా.. 


సోమవారం, జూన్ 11, 2018

సోమా మంగళ బుధ...

దేవుడిచ్చే పిల్లలని కాదనడానికి మనమెవరం అంటూ గంపెడు పిల్లల సంసార సాగరాలను అతి కష్టంమీద ఈదే ఆనాటి ప్రజలకు కుటుంబ నియంత్రణ ఆవశ్యకత తెలియజెప్పిన ఓ సరదా ఐన నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తాతామనవడు (1973)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : సుంకర
గానం : బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి  

సోమ, మంగళ, బుధ, గురు శుక్ర శని ఆది 
సోమా మంగళ బుధ గురు శుక్రా శని ఆది
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..

సోమా మంగళ బుధ గురు శుక్రా శని ఆది
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..

పెంచేదెట్లా గంపెడు మంద
పెట్టలేక మన పని గోవిందా
పెట్టలేక మన పని గోవిందా
కలిగిన చాలును ఒకరూ ఇద్దరూ
కాకుంటే ఇంకొక్కరు
కాకుంటె ఇంకొక్కరు

సోమా మంగళ బుధ గురు శుక్రా శని ఆది
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..

కాదు.. కాదు, ఒకరూ, ఇద్దరూ, ముగ్గురు
కనవలసిందే ఎందరైనా
బుద్దుడో, జవహరో గాంధీజీ
కాకూడదా ఇందెవరైనా


ఔతారౌతారౌతారు బొచ్చెలిచ్చి
బజారుకు తరిమితె
ఔతారౌతారౌతారు
బిచ్చగాళ్ళ సంఘానికి
నాయకులౌతారౌతారౌతారు
తిండికి గుడ్డకు కరువై
కడుపుమండి విషం తిని ఛస్తారు

సోమా మంగళ బుధ గురు శుక్రా శని ఆది
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..

ఎగిరే పక్షికి ఎవడాధారం
పెరిగే మొక్కకు ఎవడిచ్చును సారం
ఎగిరే పక్షికి ఎవడాధారం
పెరిగే మొక్కకు ఎవడిచ్చును సారం
దారిచూపునందరికి వాడే
దారిచూపునందరికి వాడే
నారుపోసిన వాడు నీరివ్వక పోడు


ఎవరికి వారే ఇట్లనుకుంటె
ఏమైపోవును మనదేశం
ఎప్పుడు తీరును దారిద్ర్యం
ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం
కనాలందుకే మిత సంతానం
కావాలిది అందరికి ఆదర్శం

అయ్యా అయ్యా ఎందుకు గొయ్య
నాకొక పీడర మీ తాతయ్య
చావగొట్టి పాతెయ్యడానికే ఈ గొయ్య


బాబూ బాబూ నీకెందుకురా ఆ గొయ్య
నీ అయ్యకు చేసే ఈ మర్యాద
రేపు నీకు చెయ్యాలి కదయ్యా
తాతకు వారసుడు మనవడేగా
ఎప్పటికైనా తాతా మనవడు
ఒకటేగా.. ఒకటేగా


పెద్దలనే సరిదిద్దేవాళ్ళు
ఇలాంటి ఒకరిద్దరు చాలు
కనిపెంచిన వాళ్ళు తరిస్తారు
దేశానికే పేరు తెస్తారు
వారే పేరు తెస్తారు

సోమా మంగళ బుధ గురు శుక్రా శని ఆది
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..
సోమా మంగళ బుధ గురు శుక్రా శని ఆది
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ..
వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ.. 


ఆదివారం, జూన్ 10, 2018

కరవాలమ నీ శూరత...

ఆధునిక యుగంలో అహింసకు ప్రాధాన్యత నిస్తూ కత్తి కన్నా కలం గొప్పదని తీర్మానించేశారు కానీ రెండిటిలో ఏది గొప్పదనే వాగ్వాదం ఇప్పటిది కాదు, ఐతే రెండిటిలో దేని గొప్పదానిదేనంటూ ఒకదానికొకటి సహకరించుకోవాలనీ, ఐకమత్యమే లోక సౌభాగ్యమని చాటే ఈ చక్కని నృత్యరూపకం సంఘం చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంఘం (1954)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి
గానం : పి.సుశీల, టి.ఎస్.భగవతి

కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
అధికార మదోన్మాధులనే అణచు జగానా
వడి అణచు జగానా వడి అణచు జగానా

కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
అధికార మదోన్మాధులనే అణచు జగానా
వడి అణచు జగానా వడి అణచు జగానా

పరిపాలనమే నీ వలనే సాగును కాదా
ధర సాగును కాదా
పరిపాలనమే నీ వలనే సాగును కాదా
ధర సాగును కదా
కైజారు ఎవరినైన సరే రాజు సేయునే
కైజారు ఎవరినైన సరే రాజు సేయునే
మహరాజు సేయునే
మహరాజు సేయునే
ఘన జీవితమే కావలెనా కత్తిని గొనుమా
ఘన జీవితమే కావలెనా కత్తిని గొనుమా
దశదిశలకు నేనొసగిన సందేశము నిడుమా
సందేశము నిడుమా సందేశము నిడుమా

కరవాలమ నీ శూరత ఇల చూపు బిరాన
అధికార మదోన్మాధులనే అణచు జగానా
వడి అణచు జగానా వడి అణచు జగానా

కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
దేశం కళకళలాడే కళలను తేలే విద్యలు తెలిపెదమే
తేలే విద్యలు తెలిపెదమే

కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
దేశం కళకళలాడే కళలను తేలే విద్యలు తెలిపెదమే
తేలే విద్యలు తెలిపెదమే

నాలుక పైన వాక్యమే నవకావ్యమై మెరయా
నాలుక పైన వాక్యమే నవకావ్యమై మెరయా
రతనాల నోట పలికే పలుకే గానమై వెలుగా
రతనాల నోట పలికే పలుకే గానమై వెలుగా
నవ జీవితాన సమతాసౌఖ్యం, నాట్యం చేయిస్తాం
నవ జీవితాన సమతాసౌఖ్యం, నాట్యం చేయిస్తాం
సౌఖ్యం నాట్యం చేయిస్తాం

కలములోన శక్తి చూపీ జగమే ఏలెదమే
దేశం కళకళలాడే కళలను తేలే విద్యలు తెలిపెదమే
తేలే విద్యలు తెలిపెదమే


కత్తిలో బలమును తెలియకనే డంబాలు పలికేవే పో పో పో

బుద్ధిలో బలమును తెలియకనే గొప్పలేల పల్కేవే పో పో పో
బాలచంద్ర పాపారాయుల
బాలచంద్ర పాపారాయుల
మేటి కీర్తి నిలిపినదీ కత్తీ
మేటి కీర్తి నిలిపినదీ కత్తీ
తరతరాలు గడిచినా తెలుగు వీర చరితము
తరతరాలు గడిచినా తెలుగు వీర చరితము
స్వర్ణ పుటల ప్రస్ఫుటించు శక్తీ
స్వర్ణ పుటల ప్రస్ఫుటించు శక్తీ


నేత్రాలు రెండూ ఎదురై పోర అంతా అంధకారమే
ఎట్టి శక్తియూ తానై ఒంటిగా నిలచీ గెల్వ శక్యమా
నేత్రాలు రెండూ ఎదురై పోర అంతా అంధకారమే
ఎట్టి శక్తియూ తానై ఒంటిగా నిలచీ గెల్వ శక్యమా
మీలోన ఐకమత్యమే ఈ లోక సౌభాగ్యమే
మీలోన ఐకమత్యమే ఈ లోక సౌభాగ్యమే
కత్తి శక్తి, కలము యుక్తి, మేలుకోరి జగములోన
కత్తి శక్తి, కలము యుక్తి, మేలుకోరి జగములోన
సహకరించి జయము పొందరే
సహకరించి జయము పొందరే 
 

శనివారం, జూన్ 09, 2018

పుత్తడి బొమ్మా పూర్ణమ్మ...

బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ గురజాడ వారు రచించిన ఈ నృత్యరూపకం కథ మహిమో, వారి పదజాల మహత్యమో, ఘంటసాల గారి గాన మహిమో కానీ విన్న ప్రతి సారీ కంట తడి పెట్టించక మానదు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కన్యాశుల్కం (1955)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : గురజాడ
గానం :  ఘంటసాల, బృందం

ఆఆఆ.. పుత్తడి బొమ్మా...ఆఆఆఆ..
పూర్ణమ్మా... పూర్ణమ్మ... ఔనూ..
మేలిమి బంగరు నెలతల్లారా
కలవల కన్నుల కన్నెల్లారా
తల్లుల గన్న పిల్లల్లారా
విన్నారమ్మా ఈ కథను..
విన్నారమ్మా ఈ కథను..

మేలిమి బంగరు నెలతల్లారా
కలవల కన్నుల కన్నెల్లారా
తల్లుల గన్న పిల్లల్లారా
విన్నారమ్మా ఈ కథను..
విన్నారమ్మా ఈ కథను..


హోయ్ కొండల నడుమను కోనొకటుంది ఉందీ..
కోనకి నడుమ కొలనొకటుంది.. ఓఓఓఓఓ..
హోయ్.. కొండల నడుమను కోనొకటుంది
కోనకి నడుమ కొలనొకటుంది
కొలని గట్టున కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మా
వెలసెను బంగరు దుర్గమ్మా
ఔనూ.. ఔనౌను..

పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
 అన్నదమ్ముల కనుగై దుర్గకు
పూజకు పువ్వులు కోసేది...
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా


యేయేవేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితో కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

ఆఅ.. అందాలకి చందమావలా ఆఆఆఆ..
గుణాలకి రత్నాల రాశిలా
ఆఆఆఆ.. 
 నలుగురి కన్నుల్లో కనుపాపై
నట్టింట దీపమై వెలుగుతున్న పూర్ణమను
అయ్యో..ఓఓఓఓ...
అప్పుడేం చేశారయ్యా అంటే..

కాసుకు లోనై తల్లీ దండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను
ఒక ముదుసలి మొగుడుకి ముడివేసిరి
అయ్యో పాపం
ముదుసలి మొగుడుకు ముడివేసిరి
ముదుసలి మొగుడుకు ముడివేసిరి


ముద్దు నగవులు మురిపెంబు మరి
పెనిమిటి గాంచిన నిముషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మును
కన్నుల గ్రమ్మెను కన్నీరు.. ఓఓఓఓ..

ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాతయని గేలించ
మొగుడు తాతయని గేలించ
ఆటల పాటల కలియక పూర్ణమ
దుర్గను చేరి దుఃఖించే
దుర్గను చేరి దుఃఖించే
ఓఓఓఓఓ...ఓఓఓఓఓఓఓ

తల్లిదండ్రులు గట్టిన గుదితాడు
విప్పడానికి వశమా తప్పడానికి వశమా
గొల్లు గొల్లున ఏడ్చింది.. అయ్యో
గుండె రాయి చేసుకుని ఓర్చింది..
పుత్తడి బొమ్మా... ఆఆఆఅ...
పుత్తడి బొమ్మా.. పూర్ణమ్మ..

అయ్యో...

కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను
పుత్తడి బొమ్మను పూర్ణమను
చీరలు,సొమ్ములు చాలగా తెచ్చెను.
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
పుత్తడి బొమ్మకు పూర్ణమకు

అయ్యో అప్పుడేం చేసిందయ్యా అంటే
పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ
తల్లి దండ్రీ దీవించిరి
పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ
తల్లి దండ్రీ దీవించిరి


నీ కడుపు చల్లగా పదిమంది బిడ్డల తల్లివై
పసుపు బొట్టూ పెట్టుకు
పది కాలాలా పాటు వర్ధిల్లమ్మా అంటే..ఏఏఏ..

దీవెన వింటూ ఫక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ
దీవెన వింటూ ఫక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ 
చిన్నల నందరి కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరు..
ఓఓఓఓఓ...ఓఓఓఓఓ

అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ


అన్నల్లారా! తమ్ముల్లారా!
అన్నల్లారా! తమ్ముల్లారా!
అమ్మను అయ్యను కానండీ!
అమ్మను అయ్యను కానండీ!
బంగరు దుర్గను భక్తితో 

కొలువండమ్మల కమ్మా దుర్గమ్మా!
అమ్మల కమ్మా దుర్గమ్మా!

 అమ్మల కమ్మా దుర్గమ్మా!
 
 నలుగురు కూర్చుని నవ్వే వేళల
నాపేరొకతరి తలవండి
నాపేరొకతరి తలవండి
మీ మీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి
ప్రేమను నా పేరివ్వండి
అన్నల్లారా.. అయ్యో!
తమ్ముల్లారా.. అయ్యో!

బల బల కన్నుల కన్నీరొలికెను ఓఓఓఓ
బల బల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు
పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు
కన్నులు తుడుచుకు కల కల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

 
వగచిరి వదినెలు వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడి పెట్టెన్ ఓఓఓ
కాసుకు లోనై అల్లుని తలచుకు ఔరౌరౌరా...
కాసుకు లోనై అల్లుని తలచుకు
ఆనందించెను అయ్యొకడె..ఏఏ..
అయ్యొకడే...ఏఏఏఏ...

 
యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరి గూర్చి
సంతోషమ్మున దుర్గను కొలువను
వొంటిగ పోయెను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మా.. ఆఆ.. పూర్ణమ్మా..

ఆవులు మదవులు మందలు చేరెను
పిట్టలు చెట్లను గుమికూడెన్
పిట్టలు చెట్లను గుమికూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
పూర్ణమ ఇంటికి రాదాయె
పూర్ణమ ఇంటికి రాదాయె ఓఓఓఓ
పూర్ణమ ఇంటికి రాదాయె ఓఓఓఓ
పూర్ణమ ఇంటికి రాదాయె...

కన్నుల కాంతులు కలవల చేరెను.. ఓఓఓఓ...
మేలిమి చేరెను మేనిపసల్
.. ఓఓఓఓ...
 హంసల జేరెను నడకల బెడగులు .. ఓఓఓఓ...
దుర్గను జేరెను పూర్ణమ్మ
.. ఓఓఓఓ...
 పుత్తడి బొమ్మా.. పూర్ణమ్మా.. ఓఓఓఓ...

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.