ఆదివారం, నవంబర్ 22, 2009

మాలిష్ - మల్లెపువ్వు

రావుగోపాల్రావు గారి గురించి నేను ఇపుడు ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏమీ లేదు భీకరమైన రూపం లేకున్నా ఆహర్యం, డైలాగ్ డెలివరీతో ప్రతినాయక పాత్రకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారాయన. ముత్యాలముగ్గు సినిమాలో సెగట్రీ అంటూ పరమ కిరాతకమైన డైలాగ్ సైతం నిమ్మళంగా చెప్పి వెన్నులో వణుకు పుట్టించినా, వేటగాడు లో ప్రాసల పరోఠాలు తినిపించినా ఆయనకే చెల్లింది. ఆ ప్రాసలు ఇదిగో ఇక్కడ చూడండి.



ఈ విలనిజం ఒక ఎత్తైతే నాకు ఆయన మంచివాడుగా చేసిన సాధారణమైన, హాస్య పాత్రలు కూడా చాలా నచ్చుతాయి. వాటిలో ఈ మాలీష్ పాత్ర ఒకటి. మల్లెపువ్వు చిత్రం లో గురువా అంటూ శోభన్‍బాబుకు సాయం చేసే ఓ మాలిష్ చేసుకునే మంచివాడి పాత్రలో అలరిస్తారు. ఆ పాత్రలో తన పై చిత్రీకరించిన ఈ పాట నా చిన్నపుడు నాకు నచ్చే హాస్యగీతాలలో ఒకటి. ఇదే తరహా మాలీష్ పాత్రలో ’పట్నంవచ్చిన పతివ్రతలు’ సినిమా లో తాగుబోతుగా మరింత రక్తి కట్టించారు. ఈ సినిమా లో ఇతను మాలీష్ చేయించుకునే వాళ్ళని వాళ్ళ ఊరిని పొగిడి డబ్బులు తీసుకుని ఆ డబ్బుతో తాగి వచ్చి వాళ్ళనీ వాళ్ళ ఊరిని తిడుతూ బోలెడు హాస్యాన్ని అందిస్తారు. నూతన్ ప్రసాద్ ని తిడుతూ అనుకుంటా మీది కాకినాడ అయితే ఏటి మీ కాకినాడ గొప్ప.. మాది బెజవాడ.. దాని గొప్పదనం ముందు మీఊరెంత, మీ ఊళ్ళో సిటీ బస్సులు రోడ్ మీద నడుస్తాయ్ అదే మా బెజవాడ లో మనుషులమీద నుండి నడస్తాయ్ తెలుసా.. అసలు ఎంత గొప్పోడైనా మా బెజవాడ మురుక్కాలవల వెంబడి ముక్కు మూసుకోకుండా నడవగలరా.. అని ఏకి పారేసి నవ్విస్తారు.

ఇలాటిదే ఇంకోటి ’దేవత’ సినిమాలో నరసయ్య బాబాయ్ పాత్ర ఊరిమంచిని కోరుకునే ఊరిపెద్దగా ఉంటూ "కొంపా గోడూ లో కొంప నాకిచ్చేసి గోడు మా బామ్మకిచ్చేయ్.. పొలం పుట్ర లో పొలం నాకిచ్చేసి పుట్ర మా బామ్మకిచ్చేయ్.." అనే ఆకతాయి తో "అలాగే రా మీ ఆస్తీ పాస్తీ పంచేసి ఆస్తి మీ బామ్మకిచ్చేసి పాస్తి నీకిచ్చేస్తాను.." అని మోహన్ బాబు లాంటి ఆకతాయిల ఆటకట్టించే పాత్ర లో అలరిస్తారు. ఇంకా ఘరానా మెగుడు లో చిరు కి గురువు + మామ గారిలా, జానకిరాముడు లోనూ, కొన్ని సినిమాల్లో పెళ్ళాం చాటు మొగుడు గా కూడా కొన్ని పాత్రలు వేసి బాగా ఆకట్టుకున్నారు. ఇంకా కొన్ని సినిమాలు గుర్తు రావడం లేదు. ఏదేమైనా ఈ మాలిష్ పాటలో రావుగోపాల్రావు గారిని చూసి మీరు కూడా ఆనందించండి మరి. పాడినది స్వర ’చక్రవర్తి’ గారట, ఆ స్వరం కూడా హాస్యాన్ని కురిపిస్తుంది.



చిత్రం : మల్లెపువ్వు
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆరుద్ర
గానం : చక్రవర్తి

మాలీష్... మాలీష్...
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
అరె హా హా...మాలీష్...
అరె హే హే హో హా మాలీష్...
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్
చాలంజీ మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
హెయ్..చాలంజి మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
రాందాసు మాలీషండోయ్...మాలీష్...
మాలీష్..మాలీష్..మాలీష్....మాలీష్. మా మా....

అరె హా అరె హో
మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది...
అరెహా తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె డుం..డుం..డుం...
తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె రంబొచ్చి రమ్మంటదీ...
అరె ఒళ్ళంత జిల్లంటదీ..హా..ఓహో..ఒ అనిపిస్తదీ...
అరె ఒళ్ళంత జిల్లంటదీ...షమ్మ..ఓహో..ఒ అనిపిస్తదీ...
అమ్మ తోడు.. నిమ్మ నూనే...అంట గానే.. తస్సదియ్యా...
అమ్మ తోడు నిమ్మ నూనే...అంట గానే తస్సదియ్యా...
అబ్బోసి తబ్బిబ్బులే....మాలీష్..

మాలీష్... మాలీష్...
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం

అరె హో..తల బిరుసు బుఱ్ఱైన మన చేయి పడగానె మహ తేలికైపోతదీ...
అరె హా... పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతదీ..
అరె సంపంగి నూనుంది రాజ్జా....అరె సమ్మ సమ్మ గుంటాది రాజా..
అరె సంపంగి నూనుంది రాజా...మహ సమ్మ సమ్మ గుంటాది రాజా..
హ చెవిలోన.. చమురేసీ..చెయి మూసి.. గిలకొడితే...హమ్మా....
హబ్బ....చెవిలోన చమురేసి..చెయి మూసి గిలకొడితే సంగీతమినిపిస్తదీ...
సా..సరి..గా..అ మా..పా..మద..పని..మసా...
సరిగమపదనిని..సరిగమపదనిని..సా....

జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
అరె హో మాలీష్...అరె హో మాలీష్...
హెయ్..చాలంజి మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
రాందాసు మాలీషండోయ్...మాలీష్...మాలీష్..
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.