ఆదివారం, మే 20, 2012

కుర్రాడనుకుని కునుకులు తీసే..

తను నవ్వుతో చంపేస్తుంది/చంపేస్తాడు అని మీరు చాలా సార్లు వినే ఉంటారు కదా, ఎక్కడో తారసపడిన నవ్వును చూసి కూడా అనుకుని ఉండచ్చు "హబ్బా కిల్లింగ్ స్మైల్ రా బాబు" అని. అలాంటి నవ్వు వినాలనుకుంటున్నారా ఐతే బాలు తన కెరీర్ కొత్తలో (1977) పాడిన ఈ పాట వినండి. తన స్వరం ఎంత లేతగా స్వచ్చంగా హాయిగా ఉంటుందో పాటలో అక్కడక్కడ వచ్చే నవ్వు అంతే బాగుంటుంది. "చిలకమ్మ చెప్పింది" సినిమాలోని ఈ పాటలో అంత చక్కని బాలు స్వరానికి తగినట్లుగా నటించినది రజనీకాంత్, ఇక పాట చూసిన అమ్మాయిలు ప్రేమలో పడకుండా ఉండగలిగి ఉండే వారంటారా అప్పట్లో. వీడియో చూసి మీరే చెప్పండి. 

పట్నంనుండి డ్యూటీ నిమిత్తం తన ఊరొచ్చి నివాసం ఉంటున్న హీరో రజనీవి అన్నీ కుర్రచేష్టలని తనో మెచ్యూరిటీ లేని కుర్రాడని సులువుగా కొట్టిపారేసి మనసులో ప్రేమ ఉన్నా బయటపడనివ్వకుండా బెట్టుచేసే హీరోయిన్ సంగీతని చూసి రజనీ పాడేపాట ఇది. ఈ సినిమా అక్కడక్కడా కాస్త బోరుకొట్టినా మొత్తంగా బాగానే ఉంటుంది చివర్లో మరో కథానాయిక శ్రీప్రియ నిర్ణయం ఆరోజుల్లో చాలా ధైర్యంగా తీసుకున్న నిర్ణయమనే చెప్పాలి. చక్కని తెలుగులొ ఆత్రేయగారు అందించిన సాహిత్యానికి ఎమ్మెస్ విశ్వనాథన్ గారు సంగీతమందించారు. ఈ పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలనుకున్న వారు ఇక్కడ వినవచ్చు.

 
చిత్రం : చిలకమ్మ చెప్పింది..(1977)
సంగీతం :  M.S.విశ్వనాథన్
రచన : ఆత్రేయ
గానం : బాలు

కుర్రాడనుకుని కునుకులు తీసే..
హహ వెర్రిదానికీ.. పిలుపూ..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపు ఇదే నా మేలుకొలుపూ..ఊ..!!

మల్లెలు విరిసే మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
మల్లెలు విరిసే మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
దీపమంటీ రూపముంది..
దీపమంటీ రూపముంది..
కన్నె మనసే చీకటి చేయకు..
కన్నె మనసే చీకటి చేయకు..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపు ఇదే నా మేలుకొలుపూ..ఊ..!!

మత్తును విడిచీ.. మంచిని వలచీ..
తీపికానుక రేపును తలచీ..
కళ్ళు తెరిచి.. ఒళ్ళు తెలిసీ..
మేలుకుంటే మేలిక మనకూ..
మేలుకుంటే మేలిక మనకూ..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపూ.. ఇదే నా మేలుకొలుపూ..ఊ..

వెన్నెల చిలికే వేణువు పలికే
వేళ.. నీ కిది నా తొలిపలుకు
వెన్నెల చిలికే వేణువు పలికే
వేళ.. నీ కిది నా తొలిపలుకు
మూగదైనా రాగవీణ..
మూగదైనా రాగవీణ..
పల్లవొకటే పాడును చివరకు..
పల్లవొకటే పాడును చివరకు.

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలుకొలుపు

బుధవారం, మే 02, 2012

చెలిమిలో వలపు రాగం

రకరకాల పద్దతులలో తీసుకునే మాదకద్రవ్యాల(డ్రగ్స్) గురించి వినేఉంటారు కానీ చెవుల ద్వారా సూటిగా మన మెదడుకు చేరుకుని ఆపై మత్తును తనువంతా ప్రవహింప చేసి మనిషిని తన స్వాధీనంలోకి తెచ్చుకునే ఒక డ్రగ్ గురించి మీకు తెలుసా ?? ఆ! తెలిసే ఉంటుంది లెండి తెలుగువారై అదీ నాపాటల బ్లాగ్ చదువుతూ ఇళయరాజా పాటలు వినలేదంటే నేను నమ్ముతానా.. ఆయన కొన్ని పాటలలో ఇలాంటి ఏదో తెలియని మత్తుమందును కలిపి కంపోజ్ చేస్తారు. ఆపాటలు ఎన్ని వేల సార్లు విన్నా అలా తన్మయంగా వింటూ ఉండిపోగలమే కానీ మరో ఆలోచన చేయలేం.

మౌనగీతం సినిమాలోని “చెలిమిలో వలపు రాగం” అన్న ఈ పాట అలాంటి మత్తుమందుని నింపిన పాటే... పాటకి ముందు నిముషం పాటు వచ్చే మ్యూజిక్ బిట్ కానీ పపపపా అంటూ తీసే ఆలాపన కానీ పాట మూడ్ లోకి అలా తీస్కెళిపోతే పాట ముగిసేంతవరకూ ఆత్రేయ గారి సాహిత్యం, బాలు జానకిల గాత్రం ఇళయరాజా స్వరాలతో కలిసి మిమ్మల్ని మరోలోకంలో విహరింప చేస్తుంది. ఒక్కసారి కళ్ళుమూసుకుని ఈ పాట విని చూడండి నిజం అనిపించకపోతే నన్ను అడగండి. ఇదే సినిమాలోని “పరువమా చిలిపి పరుగు తీయకు” కూడా నాకు చాలా ఇష్టం. ఆ పాట గురించి ఇది వరలో నేను రాసుకున్న టపా ఇక్కడ చూడండి.

ఈ పాట వీడియో ఎంబెడ్ పనిచేయనందున యూట్యూబ్ లో ఇక్కడ చూడగలరు. ఆడియో మాత్రమే కావాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రయత్నించండి. వీడియో పై ఆసక్తి లేనివారు ఇక్కడ వీడియోలో బొమ్మల ప్రజంటేషన్ చూస్తూ పాట వినవచ్చు.


చిత్రం : మౌనగీతం (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి

పపపపా.. పపపపాపా..
పపపపా.. పపపపాపా..

చెలిమిలో.. వలపు రాగం..
వలపులో.. మధుర భావం..
రాగం భావం కలిసే ప్రణయగీతం
పాడుకో.. పాప పపా
పాడుతూ.. పాప పపా
ఆడుకో.. పాప పపా

చెలిమిలో.. వలపు రాగం..
వలపులో.. మధుర భావం..

ఉయ్యాలలూగినానూ... నీ ఊహలో 
నెయ్యాలు నేర్చినానూ.. నీ చూపులో
ఆరాధనై గుండెలో..
ఆలాపనై గొంతులో.. 
అలల లాగా కలల లాగా..
అలల లాగా కలల లాగా.. కదలి రాగా...

చెలిమిలో.. వలపు రాగం..
వలపులో.. మధుర భావం..

నులివెచ్చనైన తాపం... నీ స్నేహము
ఎదగుచ్చుకున్న భావం.. నీ రూపము
తుదిలేని ఆనందమూ..
తొణుకాడు సౌందర్యమూ..
శ్రుతిని చేర్చీ.. స్వరము కూర్చీ..
శ్రుతిని చేర్చీ.. స్వరము కూర్చీ.. పదము కాగా

చెలిమిలో.. వలపు రాగం..
వలపులో.. మధుర భావం..
రాగం భావం కలిసే ప్రణయ గీతం
పాడుకో.. పాప పపా
పాడుతూ.. పాప పపా
ఆడుకో.. పాప పపా
పపపపా.. పపపపాపా..
పపపపా.. పపపపాపా..

మంగళవారం, మే 01, 2012

ఒక వేణువు వినిపించెను


బాలు పాటలంటే ఎంత ఇష్టమున్నా అప్పుడప్పుడు వేరే వారి గొంతు కూడా వినడం కాస్త వైవిధ్యంగా బాగుండేది ఇక ఆ స్వరం మరికాస్త వైవిధ్యంగా ఉండి మంచి పాటలు పాడితే... ఎన్నేళ్ళైనా అలా గుర్తుండిపోతుంది ఆ స్వరం. అలాంటి స్వరమే జి.ఆనంద్ గారిది. ఒకసారి ఈ పాటలు గుర్తు చేసుకోండి... ఒకవేణువు వినిపించెను (అమెరికా అమ్మాయి), దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనె ఉన్నది సీతమ్మ (కల్పన), విఠలా పాండురంగ.. నువ్వెవరయ్యా నేనెవరయ్యా(చక్రధారి), పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరే గువ్వలనడుగు (ఆమెకథ). వీటన్నిట్లోను వైవిధ్యమైన ఆ స్వరం గుర్తొస్తుంది ముంది.

అప్పటి వరకూ సినీ గీతాలలో కోరస్ పాడుతున్న ఆనంద్ గారు మొదటగా పాడిన సోలో సాంగ్ "అమెరికా అమ్మాయి" సినిమాలోని ఈ పాట “ఒక వేణువు వినిపించెను” నాకు బాగా ఇష్టమైన పాట. మీ అందరికోసం ఇక్కడ ఇస్తున్నాను. ఈ సినిమాలో బాలు పాడిన పాటలు ఏవీ నాకు అంతగా నచ్చలేదు, అందులో బాలుగారి దోషంలేదనుకోండి. ఇదే సినిమాలో మరింత ప్రాచుర్యాన్ని పొందిన “పాడనా తెలుగు పాట” మీకందరికి తెలిసే ఉంటుందనుకుంటాను. ఈ సినిమా దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు.

జి.ఆనంద్ గారి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే వారి ఇంటర్వూ ఇక్కడ చూడచ్చు. వీడియో ప్లే అవకపోతే ఆడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : అమెరికా అమ్మాయి 1976
సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం : మైలవరపు గోపీ
గానం : జి.ఆనంద్

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
నవమల్లిక చినబోయెనూ..నవమల్లిక చినబోయెనూ..
చిరునవ్వు సొగసులో!!

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
రేరాణియే నా రాణికీ..రేరాణియే నా రాణికీ..
పారాణి పూసెనూ!!

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా??
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా??
నా గుండెలో వెలిగించెనూ..నా గుండెలో వెలిగించెనూ..
సింగార దీపికా!!

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా!!

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.