గురువారం, ఆగస్టు 28, 2014

వేటాడందే ఒళ్ళోకొచ్చి...

చేతిలో బంగారమంటి విద్య ఉండి కూడా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా బతికేస్తూ ఏ పని చేయకుండా జాతకాలనూ బల్లి శాస్త్రాలను నమ్ముకుని అదృష్టం కోసం ఎదురు చూసే మనిషి "లేడీస్ టైలర్" సినిమా కథానాయకుడు సుందరం. పల్లెల్లో ఆహ్లాదకరమైన ఉదయపు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఆతని బద్దకం గురించి కూడా ప్రేక్షకులకు చక్కని అవగాహన వచ్చేలా టైటిల్స్ కి నేపధ్యంగా ఒక పాట పెడితే బాగుంటుందనుకున్నారు వంశీ. తన ఆలోచనలకు సిరివెన్నెల గారు చక్కని అక్షరరూపమిస్తే ఇళయరాజా గారు గురకను నేపధ్యంగా చేసుకుని ఆకట్టుకునే బాణి ఇచ్చారు ఇక వంశీ గారు చిత్రీకరించడంలో తగ్గుతారా.

అయితే ఎందుకో ఈ పాటను క్యాసెట్ లో మిగిలిన పాటలతో పాటు విడుదల చేయలేదు కేవలం సినిమాలో మాత్రమే ఉంటుంది. సినిమా చూసేప్పుడు నేపధ్య సంగీతంలా తప్ప ఒక ప్రత్యేకమైన పాటగా గుర్తించలేకపోయామని చాలామంది చెప్పారు. నాకు కూడా ఈ సినిమా మొదటిసారి చూసినపుడు ఈ పాట అస్సలు గుర్తులేదు. శ్రద్దగా ఆలకించాక నాకు బాగా ఇష్టమైన పాటలలో ఒకటిగా చేరింది. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఆడియోలో లేకపోవడంతో ఈ పాట పాడిన గాయనీ గాయకుల గురించి కూడా సరైన సమాచారం లేదు, మీకు తెలిస్తే పంచుకోగలరు. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే (సినిమా నుండి ఎంపీత్రీ కట్ చేశాను) ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది ఎంబెడ్ వీడియోలో 1m 45s దగ్గర పాట మొదలవుతుంది. 



చిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం  : బాలు(???), కోరస్
డైలాగ్స్ : రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్
 
సూరీడు సూదులెట్టి పొడుత్తున్నాడు.. లేద్దూ..
వెంకటరత్నంగారి కోడి కూతేసేసింది.. లేద్దూ..
 
హైలేస్సా హైలేసా.. హైలేస్సా హైలేసా.. హైలేస్సా హైలెసా.. 

జాలరోళ్ళు అప్పుడే గోదాట్లోకి వెళ్ళిపోతున్నారు.. లెమ్మంటుంటే
బంగారమంటి విద్య చేతిలో పెట్టుకుని ఈ బద్దకమేవిటి
కుంభకర్ణుడిలా ఆ నిద్దరేవిటీ...
ఇలా అయితే నువ్ పనికి రావ్ చేతిలో ఉన్న విద్యనుపయోగించాలి..
హ్మ్.. నీలాంటి వాడి దగ్గర పనిచేయడం నా బుద్దితక్కువ


వేటాడందే ఒళ్ళోకొచ్చి చేప చేరదు
రెక్కాడందే గూటిలోకి కూడు చేరదు
తెల్లారే దాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదు
గింజా గింజా ఏరకుంటే పూట తీరదు

ఓగురువా సోమరిగా ఉంటే ఎలా
బద్దకమే ఈ జన్మకు వదిలిపోదా
గురకలలో నీ బ్రతుకే చెడును కదా
దుప్పటిలో నీ బ్రతుకే చిక్కినదా

లేవర లేవర.. అబ్బా పోరా..
సుందర సుందర.. తంతానొరేయ్.. 
చాలును నిద్దర..
థూ... ఈ సారి నిద్దర లేపావంటే సంపేత్తానొరేయ్
 
గోదారమ్మో సల్లంగా దారి సూపవే
సల్లని తల్లి నీ పాపల కాపు కాయవే
వయ్యారంగా మా పడవల ఊయలూపవే
హైలెస్సా హుషారుగా బతుకు నడపవే

కోటిపల్లి కూనవరం ఏ రేవైనా
గెడనునెట్టి తెరలు కట్టి సేరేమమ్మా
అద్దరికి ఇద్దరికీ ఈ మజ్జిన
ఏ పొద్దూ బద్దకమే ఉండదమ్మా

ఎయ్యర ఎయ్యర
జోరుగ జోరుగ
హైలెస్స హైలెస్స హైలెస్స

థూ... మీ పడవలూ పాటలూ తగలెయ్యా
పొద్దున్నే నిద్దర చెడగొట్టేసారు కదరా...
 

అల్లీ బిల్లీ అల్లరాటకు
చలాకీగా తుళ్ళిపడే ఈతలాటకు
ఒప్పులకుప్పా చకా చకా చిందులెయ్యవే
కిందా మిందా సూడకుండా మొగ్గలెయ్యరా

ఆటలలో పాటలలో విసుగులేదు
ఆయాసం మాకెపుడూ అడ్డేరాదు
సోంబేరికి ఈ బలమే ఎప్పుడు రాదు
మొద్దులతో సావాసం మాకు వద్దు

చెమ్మా చెక్కా.. సిందులు మానండెహె..
చూడర గొప్పా.. సప్పుడు చేయకండెహె..
వెయ్యర మొగ్గ
థూ.. రేయ్ నా నిద్దర సెడగొట్టొద్దన్నానా

ఎర్రబడే తూరుపు మందార మొగ్గలు
నవ్వులతో ముంగిట ముత్యాల ముగ్గులు
చెట్టూ చేమా పూచే ఈ వెలుగు పువ్వులు
కిలా కిలా తుళ్ళిపడే కాంతి నవ్వులు

చెమటలలో తళుకుమనే చురుకుదనం
కండలలో పొంగిన బంగారు బలం
పాటడిదే దొరికినదే అసలు సుఖం
సోమరులకు తెలియనిదీ తీపి నిజం

తియ్యర తియ్యర
తొందర సెయ్యర
పనిలో...
తియ్యర తియ్యర
తియ్యర తియ్యర


2 comments:

వంశీగారిని అభిమానించని వారు అరుదుగా వుంటారనిపిస్తుందండి..అందులోనూ ఈ పాట మీకు చాలా ఇష్టమాండీ ,ఇంత పెద్ద డిస్క్రిప్షన్ పెట్టారు..

అవును శాంతి గారు. నాకు బాగా ఇష్టమీ పాట :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.