బాలు గారు పాడిన ఈ పాట నాకు చాలానచ్చే పాటలలో ఒకటి. హిందీలో కిషోర్ కుమార్ గారి పాటలలో సాహిత్యం, ట్యూన్ ఒక అందమైతే కిషోర్ కలిపే సంగతులు మరింత అందాన్నిస్తాయి. మెలొడీ + హిందీ అస్వాదించలేనంత చిన్న వయసు లోకూడా నేను కిషోర్ పాటలు ఈ జిమ్మిక్కుల కోసం వినే వాడ్ని. ఉదాహరణ కి దూరదర్శన్ లో ఆదివారం ఉదయం వచ్చే రంగోలీ లో ఈ పాట ఎక్కువగా వేసే వాడు. "చలాజాతాహూ కిసీకే దిల్ మే..." ఈ పాటలో మధ్య మధ్యలో కిశోర్ విరుపులు సాగతీతలు భలే ఉండేవి. ఇలాంటివే ఇంకా చాలా పాటలు ఉన్నాయ్.
ఇక ప్రస్తుతానికి వస్తే ఇంటింటి రామాయణం లోని ఈ పాటను కూడా బాలు తన స్వరంతోనే నవరసాలు పలికించేస్తారు. అక్కడక్కడ పదాలు పలకడం, సాగతీయడం లాటి సంగతులు పాటకు మరింత అందాన్ని ఇస్తాయి. "మల్లెలు పూసే వెన్నెలకాసే" అని వింటే మనకి నిజంగా వెన్నెల్లో తడిచినంత హాయైన అనుభూతి కలుగుతుందనడం అతిశయోక్తి కాదేమో. "ముసి ముసి నవ్వులలో.." అన్నచోట విరిసీ విరియని మొగ్గలా చిన్న నవ్వును మనమీద చిలకరిస్తారు.. చివరికి వచ్చే సరికి "పెనవేయి" అన్న మాట ఎంత బాగా పలుకుతారో ఆ అనుభూతి వింటే గానీ తెలియదు. వేటూరి వారి సాహిత్యం అందంగా అలరిస్తే, రాజన్ నాగేంద్ర గారి సంగీతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది. మొత్తం మీద విన్నాక ఒక అందమైన అనుభూతిని మిగిల్చే ఈ పాట మన అందరి కోసం ఇక్కడ, మీరుకూడా విని ఆనందించండి.
పాట వినాలంటే ఇక్కడ నొక్కి వినండి చిత్రం : ఇంటింటి రామాయణం(1979)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : యస్ పి బాలసుబ్రహ్మణ్యం
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులే.. నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మోజులే.. నీ విరజాజులై
మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె
మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
హాహా..ఆ..హాహా...హా...ఆ....ఆ.......
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవె
ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా..
అందిన పొందులోనె అందలేని విందులీయవె
కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
image courtesy tollywoodsingers.com