ఆదివారం, డిసెంబర్ 13, 2009

ఓ నిండు చందమామ !!

లేతమావి చిగురులు అప్పుడే తిన్న గండు కోయిలలా... ఆ పరమేశ్వరుడు గరళాన్ని నిలిపినట్లు ఇతనెవరో అమరత్వాన్ని సైతం త్యాగం చేసి అమృతాన్ని తన గొంతులోనే నిలిపివేసాడా? ప్రతి పాటలోనూ అదే మాధుర్యాన్ని ఒలికిస్తున్నాడు అనిపించేటట్లు, తన విలక్షణమైన గళంతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసే అద్భుతమైన గాయకుడు కె.జె.ఏసుదాసు. తను పాడినది కొన్ని పాటలే అయినా ఆయన పాటలను పదే పదే ఇప్పటికీ వింటున్నారంటే ఆపాటల సంగీత సాహిత్యాలు ఒక కారణమైనా ఆయన గళం లోని మాధుర్యం సైతం పెద్ద పాత్ర వహిస్తుంది అన్నదాంట్లో ఎలాంటి సందేహంలేదు. ఏసుదాస్ పేరు వినగానే తెలుగులో మొదట గుర్తు వచ్చేది మేఘసందేశం అయినా తర్వాత గుర్తొచ్చేది మోహన్ బాబు గారి పాటలు. ఇవేకాకుండా తెలుగులో ఆయన ఇంకా చాలా మంచి పాటలు పాడారు. ఇక హిందీ విషయానికి వస్తే ఆయన పేరు విన్న వెంటనే చిత్‍చోర్ చిత్రాన్ని అందులోని "గొరి తెర గావ్ బడాప్యారా" పాటనీ గుర్తు చేసుకోని వారు ఎవరూ ఉండరేమో.

తెలుగులో బాగా ప్రాచుర్యాన్ని పొందిన పాటలు చాలా ఉన్నా నాకు ఎందుకో ఈ "నిండు చందమామ.." పాట చాలా ఇష్టం. సహజంగా జాబిలి అంటే ఉన్న ఇష్టం వల్లనో తెలియదు. తనగొంతులోని మాధుర్యమో తెలియదు. సాహిత్యం లోని అందమో తెలియదు కారణమేదైనా నాకు చాలా నచ్చిన పాట ఇది. మొదటి సారి అలవోకగా విన్నపుడు పాత పాట కనుక పి.బి. శ్రీనివాస్ గారు పాడారేమో అనుకున్నాను కానీ గొంతు ఏసుదాస్ గారిదిలా ఉందే అని తర్వాత క్యాసెట్ పై చూసి అచ్చెరువొందాను. ఈన అప్పుడే ’63 లోనే తెలుగు సినిమాకు పాడారా అని. ఆరుద్ర గారి సాహిత్యం మదిలో గిలిగింతలు పెడితే, కోదండపాణి గారి సంగీతం హాయిగా సాగిపోతుంది. ఇక ఏసుదాస్ గారి గాత్రం గురించి  చెప్పనే అక్కరలేదు. ప్రత్యేకించి "నిండు చందమామ" కు ముందు "ఓ ఓ ఓ ఒ ఒ ఒ ఓ.." అని పలికినపుడు ఆహా అనిపించక మానదు. మీరు కూడా విని ఆనందించండి.



ఈ పాట వినాలంటే చిమట మ్యూజిక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రం : బంగారు తిమ్మరాజు (1963)
సంగీతం : యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం : కె.జె.ఏసుదాస్

ఓ నిండు చందమామ నిగ నిగలా భామ
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా..
ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ...

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..

మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా..

ఓ ఓ ఓ నిండు

దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..

దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..

నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే..

ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ....

ఏసుదాస్ గారి గురించి చెప్పి ’గొరితెర గావ్ బడా ప్యారా’ వీడియో ఇవ్వకుండా ముగించాలని అనిపించడం లేదు అందుకనే ఈ పాటకు తగ్గ విజువల్స్ తో కూర్చిన ఈ అందమైన వీడియో మీకోసం.


6 comments:

ఈ పాట మొదటి రోజుల్లో పాడటం వల్ల అనుకుంటాను,జేసుదాస్ గొంతులో గంభీరత్వం కంటే ఫ్రెష్ నెస్ ఎక్కువగా కనపడుతుంది కదూ వేణూ! అందుకే ఆ పాట ఆయన మిగతా పాటలకంటే భిన్నంగా, ప్రత్యేక మైన ఫ్లేవర్ తో ఉంటుంది.

ఈ బ్లాగు ఇన్నాళ్ళూ చూడటానికి ఏదో ఒక కారణం చేత కుదరలేదు. అభినందనలు. ఇలాంటి బ్లాగొకటి నేనే మొదలు పెడదామనుకుంటూనే ఆలస్యం చేసేశాను. చాలా బావుంది.

నిజమే సుజాత గారు మీరు చెప్పిన కారణమే అయి ఉంటుంది. 70 లలోని పాటలు చాలావరకు ఇలానే ఉంటాయి. వ్యాఖ్యకు నెనర్లు.

ఈ బ్లాగ్ మొదలుపెడదాము అనుకున్న చాలా రోజులకు కుదిరిందండీ.. టపాలు కూడా తరచుగా ప్రచురించడంలేదు కనుక మీ కంటపడి ఉండదు.

మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు. నేను కూడా ఇది PBS పాడేరని అనుకున్నాను మొదట. ఈ సినిమా '64 లో విడుదలైందనుకుటాను (??). జేసుదాస్ మంచి కుటుంబం (1965) లో కూడ ఒక పాట పాడినట్లు గుర్తు (ప్రేమించుట పిల్లల వంతు).

kk గారు నెనర్లు. ఓ అవునా మంచి కుటుంబం గురించి నాకు తెలియదండి.

చాలా రోజులకి ఈ పాట గుర్తు చేసారండి. చాలా బాగుంటుంది. ఈ రోజు వింటూఉంటే ఇంకా ఫ్రెష్ గా ఉంది. ఆ గొంతులో తీయదనం మరచిపోలేము. థాంక్యూ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.