బుధవారం, డిసెంబర్ 11, 2013

మెరిసే మేఘమాలికా


బాలుగారి గళంలో లేత కొబ్బరి నీళ్లలాంటి కమ్మదనం పలుకుతున్న సమయంలో వచ్చిన ఈ మధుర గీతం ఎన్నిరోజుల తర్వాత విన్నా ఆకట్టుకుంటుంది అలాగే ఎన్నాళ్ళు గడిచినా శాశ్వతంగా మదిలో నిలిచిపోతుంది. సినారె గారి సాహిత్యం పెండ్యాల గారి స్వరం ఒకదానికొకటి చక్కగా అమిరాయి. సరళమైన పదాలలో అందమైన భావాలని పలికించే సినారే గారి సాహిత్యం చాలా బాగుంటుంది. ఈ అందమైన పాట ఇక్కడ వినండి.  

చిత్రం : దీక్ష (1974)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సినారె
గానం : బాలు

మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక
చెలితో మాటలాడనీ..
వలపే పాట పాడనీ..
వలపే పాట పాడనీ

మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక

కమలాలే నా రమణీ నయనాలై విరిసే
అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మెరిసే
ఆ నయనాల కమలాలలోనా..
నా జిలుగు కలలు చూసుకోనీ
ఆ అద్దాల చెక్కిళ్ళలోనా..
నా ముద్దులే దాచుకోనీ

మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక

మధుమాసం చెలి మోవిని దరహాసం చేసే
తెలి జాబిలి చెలి మోమున కళలారబోసే
ఆ దరహాస కిరణాలలోనా..
నను కలకాలం కరిగిపోనీ
ఆ కళల పండువెన్నెలలోనా..
నా వలపులన్ని వెలిగిపోనీ.

మెరిసే మేఘ మాలికా..

7 comments:

hmmmm....nakenduko assalu nachadu ee pata :(

వేణూ జీ పాట సందర్భం తెలీదు కానీ..సహజం గా యే హీరో కైనా చెలి తో వున్నప్పుడు వర్షమే ప్రియ నేస్తం కదా..మరి బాలూ గారు ఇంత విషాదంగా ఈ ప్రణయ రాగాన్ని ఆలపిస్తున్న కారణ మేమిటో..మీరు మీ పాటల తోట లోని కంకాంబరాలనీ, పొద్దు తిరుగుదు పూలనీ వదిలి..మల్లెలు, సన్నజాజులూ ప్రెజంట్ చేయాలని మీ అభిమానిగా నా కోరిక..

ఐ మీన్-కనకాంబరాలు..పొద్దు తిరుగుడు పూలు..

శాంతిగారు, నాకూ పాట సంధర్బం కరెక్ట్ గా తెలీదండీ వీడియో కోసం చాలా వెతికాను కానీ దొరకలేదు. పాట సాహిత్యాన్ని బట్టి చూస్తే విరహగీతమనే అనిపిస్తుందండీ తాత్కాలికంగా (బహుశా అలకలతో) దూరమైన చెలితో మళ్ళీ మాటలాడనివ్వమని మేఘమాలిక మెరుపులనే తప్ప ఉరుములను తట్టుకోలేనని పాడుతున్నట్లు ఉంది. అందుకే బాలుగారు అలా పాడి ఉండచ్చు.

హహహ అన్యాపదేశంగా మీరిచ్చిన ఆదేశం బాగుందండీ అందరూ జాజులూ మల్లెలే అంటే కనకాంబరాలూ పొద్దుతిరుగుళ్ళు అలుగుతున్నాయని కాసింత వాటిపై శ్రద్దపెట్టాను. అలాగే ముందు పోస్టులలో మీరన్నమాట తప్పక జ్ఞాపకం పెట్టుకుంటాను :-)

నేను అడగగానే నాకు ఇష్టమైన ఈ పాట ని రాసినందుకు వేణు గారు :)

యూ ఆర్ మోస్ట్ వెల్కం ఫోటాన్ :-))

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail