సోమవారం, సెప్టెంబర్ 23, 2013

రుక్మిణీ కళ్యాణం హరికథ

హరికథా ప్రక్రియపై నాకున్న మక్కువ మీ అందరికీ తెలిసినదేగా ముఖ్యంగా సినిమాల్లో వచ్చే హరికథలంటే నాకు మరీ ఇష్టం. సూత్రధారులు సినిమాలోని ఈ రుక్మిణీ కళ్యాణ హరికథ కూడా బాగుంటుంది. సాథారణంగా కథకులుగా మగవాళ్ళనే చూస్తుంటాం అయితే ఈ సినిమాలో రొటీన్ కి భిన్నంగా కె.విశ్వనాధ్ గారు కె.ఆర్.విజయ గారితో హరికథ చెప్పించారు. ఆవిడ ఆహార్యానికి తగినట్లుగా సుశీల గారు నేపధ్యగానం చేశారు, కనులు మూసుకుని కథ వింటూంటే సన్నివేశాలు (సినిమాలోవి కాదు రుక్మిణీ కళ్యాణంలోని సన్నివేశాలు) కళ్ళముందు సాక్షాత్కరించేస్తాయి. 

ఈ పాటను రాసినది మాడుగుల నాగఫణి శర్మ గారన్న విషయం ఈరోజే దీని గురించి వెతుకుతుంటే తెలిసింది. ఇవికూడా ఏవైనా పద్యాలలోవేమో తెలియదు కానీ ప్రాసతో కూడిన కొన్ని కొన్ని పదప్రయోగాలు చాలా ఆకట్టుకుంటాయి. కె.వి.మహదేవన్ గారి బాణి గురించి నే చెప్పగలిగినదేముంది అద్భుతమనే మాట తప్ప. ఈ హరికథను మీరు ఇక్కడ వినవచ్చు ప్లే లిస్ట్ లో మొదటినుండి ఐదవ పాట “శ్రీరస్తూ శుభమస్తూ” అనే టైటిల్ తో ఉంటుంది.  

చిత్రం : సూత్రధారులు
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : మాడుగుల నాగ ఫణి శర్మ
గానం : సుశీల, ఎస్. పి. పల్లవి

శ్రీమద్ గజాననం నత్వా
స్తుత్వా శ్రీ సత్య సాయినమ్
శ్రీ హరికథా పితామహమహమ్ వందే..
నారాయణ దాస సద్గురుమ్.

శ్రీరస్తూ... శుభమస్తూ...

శ్రీరస్తు శుభమస్తు
సత్కథాలహరికీ.. హరికీ ..
ఆగమలతల కొసల విరిసినా విరికి... హరికీ
కోటి కొంగుల ముడుల పుణ్యంబు సిరికీ... హరికీ
సిరికీ... హరికీ.. శ్రీరస్తు శుభమస్తు

యత్ర శ్రీకృష్ణ సంకీర్తనమ్..
తత్ర శుభమంగళ సంవర్తనమ్... అని ఆర్యోక్తి..
అలాంటి సర్వమంగళ మోహనాకారుడైన శ్రీకృష్ణుడి అనేకానేక లీలా వినోదములలో... రుక్మిణీ కల్యాణ సత్కథా మధురాతి మధురమైనది.. అందలి నాయికామణి...
ఆ రమణీ..
లలిత పల్లవపాణి నీలసుందరవేణి...
అందాల పూబోణి... ఆ రుక్మిణీ...
అందాల పూబోణి... ఆ రుక్మిణీ...

కనులవి తెరచిన చాలు.. యదునందను అందమె గ్రోలూ
కరములు కదలిన చాలు.. కరివరదుని పదముల వ్రాలు
పెదవులు మెదిలిన చాలు.. హరిజపముల తపములదేలు
ఉల్లమంతా నల్లనయ్యే.. వలపు ఓపని వెల్లువయ్యే..

అంతలో..

యదుకేసరితో హరితో గిరితో
మన వియ్యము గియ్యము కూడదని
శిశుపాలుని పాలొనరింతునని
తన సోదరుడాడిన మాటవినీ..
దిగులుగొనీ.. దిక్కెవ్వరనీ.. 

తలపోసి తలపోసి తెలవారగా..
తనువెల్ల తపనలో తడియారగా..
తలపోసి తలపోసి తెలవారగా..
తనువెల్ల తపనలో తడియారగా..
ప్రళయమే రానున్నదని ఎంచెను..
ప్రణయ సందేశమాస్వామీ కంపెనూ..

ఆ లలిత పల్లవపాణి.. నీల సుందర వేణి..
అందాల పూబోణి ఆ రుక్మణీమణికి..
శ్రీరస్తు శుభమస్తు..
శ్రీరస్తు శుభమస్తు.

అగ్రజుడైన రుక్మి తన పంతమే తనదిగా
శిశుపాలునికిచ్చి వివాహము జరిపింప నిశ్చయింపగా
ఆ చిన్నారి రుక్మిణీ.. 

రానన్నాడో... తానై రానున్నాడో...
ప్రభువు ఏమన్నాడో.. ఏమనుకున్నాడో
అని మనసున విలవిలలాడు తరుణంబున

అది గ్రహించని చెలికత్తెలా రుక్మిణీదేవికీ...

తిలకము దిద్దిరదే... కళ్యాణ తిలకము దిద్దిరదే
చేలముగట్టిరదే... బంగారు చేలముగట్టిరదే
బాసికముంచిరదే... నుదుటను బాసికముంచిరదే
పదములనలదిరదే... పారాణి పదములనలదిరదే...
పారాణి పదములనలదిరదే...

ఇవ్విదమ్మున అలంకరింపబడిన రుక్మిణిదేవీ...
శిలపై అశువులుబాయు బలిపశువు చందంబున...
అందంబును ఆనందంబును వీడి...
డెందంబున కుందుచుండగా...

అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
శ్రీరుక్మిణీ హృదయప్రణయాక్షరీ
అదిగో వచ్చెను వాడె...

వచ్చీ వైరుల ద్రుంచి.. వరరత్న మై నిల్చి
వనితా మనోరధము దీర్చీ.. రథము బూన్చి
జయవెట్ట జనకోటి.. వెడలే రుక్మిణి తోటి
అదిగో అదిగో వాడే హరి శ్రీహరి..

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా...
న్యాయేన మార్గేన మహిమ్ మహీశాః...
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమ్
లోకా సమస్తా సుఖినో భవంతు...
 

2 comments:

వేణూజీ..గంగిరెద్దుల వాళ్ళ లైఫ్ స్టైల్ ని యెంతో హృద్యం గా చూపించారు కళాతపస్వి ఈ మూవీ లో..మంచి సాంగ్..దానికింద మీ కన్నయ్య కూడా చాలా బావునాడండీ..ఈ సినిమా లోని ఆయ తనవాన్ భవతీ" అనే పాట చాలా ఇష్టం నాకు..

థాంక్స్ శాంతి గారు. అవునండీ గంగిరెద్దుల వారి జీవనవిధానాన్ని చాలా బాగా చూపించారు. హహహ కన్నయ్యని మా కన్నయ్యని చేసేసినందుకు డబుల్ థాంక్స్ :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail