గురువారం, ఫిబ్రవరి 02, 2012

జానకి రాముల కళ్యాణానికి..

సంసారం ఒక చదరంగం సినిమాలోని ఈ పాట నాకు బాగా నచ్చిన పాటలలో ఒకటి, చక్రవర్తి గారు ఆహ్లాదకరమైన సంగీతాన్నిస్తే సుశీలమ్మ తన స్వరంతో ప్రాణంపోశారు. పాట ప్రారంభంలో వచ్చే ఆలాపన ఎక్కడో విన్నట్లు అనిపించినా(ఎక్కడో చెప్పగలరా?) అసలు ఆ ఆలాపనతోనే మనని కట్టిపడేస్తారు. పాట సాహిత్యం ఎవరో కరెక్ట్ గా తెలియదు కానీ అంతర్జాలంలో కొన్నిచోట్ల వేటూరి గారని ఉంది ముఖ్యంగా రెండవ చరణం విన్నాక వేటూరి గారే రాశారనే నమ్మకం బలపడిపోతుంది. పాట రెండవచరణంలో ఝల్లున వీణలు పొంగినవి అన్నతర్వాత వచ్చే వీణానాదానికి ఝల్లుమని పులకించని మది ఉండదు అంటే అతిశయోక్తికాదు.
ఈ పాట చిత్రీకరణ సన్నివేశానికీ పాత్రల స్వభావానికి తగినట్లు ఉంటుంది. పెళ్ళిచూపులలో తరతరాలుగా అచ్చొచ్చిన పాటను పాడుతున్న సరోజ(నటి కల్పన) తన స్వభావానికి తగ్గట్టుగా తను ప్రేమించే పీటర్ తో పార్కులో కులుకుతూ చిత్రమైన స్టెప్పులేస్తూన్నట్లు ఊహించుకున్నట్లుగా మొదటి చరణం చిత్రిస్తారు. పాట మధ్యలో వయసు మీద పడి ఆరోగ్యంకోసం తిండి తినకుండా నోరుకట్టేసుకోలేని అప్పల నరసయ్య(గొల్లపూడి) మంచినీళ్ళకని చెప్పి వంటగదిలోకొచ్చి చక్రపొంగలి దొంగిలించడానికి విఫలయత్నం చేయడం చిత్రిస్తారు. ఆపై రెండవ చరణం ఉమ(సుహాసిని) పాత్రపై అపరసరస్వతీ దేవిలా చక్కగా చీరకట్టుకుని చాపమీద కూర్చుని ఒడిలో వీణ పట్టుకుని పాడుతున్నట్లుగా చిత్రీకరిస్తారు. ఇక కొనసాగింపుగా అన్నపూర్ణమ్మ గారి వర్షన్ తన పెళ్ళిచూపుల సన్నివేశం చక్కని హాస్యాన్ని అందిస్తాయి.  

ఓ మంచి పాట విన్నామనే సంతృప్తిని ఇచ్చి మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ పాటను మీరూ ఆస్వాదించండి. ఈ సినిమా గురించి పూర్తి పరిచయం కోసం మిత్రులు నెమలికన్ను మురళి గారి టపా తన బ్లాగులొ ఇక్కడ చదవండి. వీడియో ప్లేకాకపోతే ఆడియో ఇక్కడ వినవచ్చు. అది కూడా పని చేయకపోతే ఇక్కడ ఈ పాటను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

చిత్రం : సంసారం ఒక చదరంగం (1987)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : సుశీల

జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే
జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవీ కులుకులనే సితాకోకా చిలుకలతో
జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే

కన్నూ కన్నూ కలువగనే ప్రణయం రాగం తీసెనులే
పాదం పాదం కలుపగనే హృదయం తాళం వేసెనులే
ఒకటే మాట ఒకటే బాణం ఒక పత్నీ శ్రీరామవ్రతం
నాలో... నీలో... రాగం తీసీ వలపే చిలికే త్యాగయ కీర్తనలెన్నో

జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవీ కులుకులనే సితాకోకా చిలుకలతో
జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే

జానకి మేనూ తాకగనే ఝల్లున వీణలు పొంగినవీ...
జాణకు పులకలు పూయగనే జావళి అందెలు మోగినవి
ప్రేమేసత్యం ప్రేమేనిత్యం ప్రెమేలే రామయ్య మతం
నాలో... నీలో... లాస్యాలాడీ లయలే చిలికే రామదాసు కృతులెన్నో..

జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవీ కులుకులనే సితాకోకా చిలుకలతో
జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే

5 comments:

వేణుగారూ ఈ వారం మా తెలుగు బడి పిల్లలకు కథ చెప్పడం కోసం సీతారాముల కళ్యాణఘట్టం వ్రాయడం ముగించి ఇలా వచ్చాను, మీ పాట కూడా అదే..

ధన్యవాదాలు శ్రావ్య, జ్యోతిర్మయి గారు.

మంచి సాహిత్యం, మంచి పాట, సినిమా కూడా...విలువలు గుర్తుచేస్తూ చక్కగా తీశారు...ఆ రోజుల్లో ఇలాంటి సినిమాలు తరచూ వస్తుండేవి...కాలం బాగా మారిపోయింది చాలా వేగంగా...కదూ!

అవును చిన్ని ఆశగారు, కాలం చాలా వేగంగా మారిపోయింది.. సినిమాలు మరీనూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.