ఈ సినిమా నాకు పూర్తిగా చూసినట్లు గుర్తు లేదు ఎపుడో ఒక సారి టీవీ లో ఈ పాట వేస్తుంటేనో లేక సినిమా వేస్తుంటే పాట మాత్రమే చూసానో కూడా సరిగా గుర్తు లేదు కాని అప్పట్లో రేడియో లో క్రమం తప్పకుండా నేను వినే కొన్ని పాటలలో ఇదీ ఒకటి. మొదట్లో అంటే మరీ చిన్న తనం లో బామ్మ గారి కామెంట్స్ విని నవ్వుకోడానికి వినే వాడ్ని, కాస్త పెద్దయ్యాక భామ గారి పాట్లు అవగతమై పాట పూర్తి గా అర్ధమయింది :-) ఇక జానకమ్మ గారి గాత్రం గురించి నేనేం చెప్పినా తక్కువే... ఆ దోర నవ్వు దాచకే అని అంటూ ఆవిడ నవ్వే నవ్వు మనకే తెలియకుండా మన పెదవులపై చిరుమందహాసాన్ని నాట్యం చేయిస్తుంది. అంతెందుకు ఆవిడ శీతాకాలం అంటూ గొంతు వణికించడం వింటే ఎంత మండు వేసవి లో ఉన్నా మనకీ చలి వేసి వణుకు పుట్టేస్తుందంటే...